Mahaa Daily Exclusive

  వన్‌ప్లస్ ఇండియా సీఈఓ అవుట్..!

  • వన్‌ప్లస్ ఇండియా సీఈఓ అవుట్.
  •  మార్చి 31తో రాబిన్ లియు నిష్క్రమణ.
  •  స్మార్ట్‌ఫోన్ దిగ్గజంలో అలజడి.
  •  పుకార్ల వేళ వన్‌ప్లస్ కీలక నిర్ణయం.
  •  నోరు విప్పిన కంపెనీ.. ఇండియా మార్కెట్‌పై తగ్గేదే లేదంటూ స్పష్టీకరణ.

హైదరాబాద్‌:మహా.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్ కంపెనీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు ఈ నెల 31 నుంచి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అంతర్జాతీయంగా వన్‌ప్లస్ కార్యకలాపాలు నెమ్మదిస్తున్నాయని, కొన్ని మార్కెట్ల నుంచి తప్పుకుంటుందన్న వదంతులు గత నెల రోజులుగా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబిన్ లియు నిష్క్రమణ కేవలం వ్యక్తిగత ఆసక్తుల కోసమేనని కంపెనీ చెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ వ్యూహాల్లో వస్తున్న మార్పుల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నోటీసు పీరియడ్‌లో ఉన్న లియు, త్వరలోనే చైనాకు తిరిగి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

గతంలో అమెరికా, యూరప్ వంటి పాశ్చాత్య మార్కెట్లలో వన్‌ప్లస్ తన బృందాలను తగ్గించుకుంటోందని, నిర్ణయాధికారాలన్నీ చైనా నుంచే జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కంపెనీ కొన్ని ప్రాంతాల్లో తన ఉనికిని నిశ్శబ్దంగా తగ్గిస్తోందంటూ ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ వంటి నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ తరహా వార్తలను రాబిన్ లియు గతంలోనే ఖండించారు. అవన్నీ తప్పుడు సమాచారమని, కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వాటాదారులకు హామీ ఇచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ఆకస్మికంగా పదవి నుంచి తప్పుకోవడంతో పాత అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా షిప్‌మెంట్లు తగ్గడం, కొన్ని ఉత్పత్తుల రద్దు వంటి అంశాలు కంపెనీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న సంకేతాలను ఇస్తున్నాయి.

భారత వినియోగదారుల విషయంలో మాత్రం వన్‌ప్లస్ గట్టి భరోసా ఇస్తోంది. సీఈఓ మారినప్పటికీ తమ దేశీయ వ్యూహంలో ఎటువంటి మార్పు ఉండబోదని, భారత మార్కెట్ తమకు అత్యంత కీలకమని స్పష్టం చేసింది. త్వరలోనే విడుదల కానున్న వన్‌ప్లస్ 16, 16 ఆర్ వంటి మోడళ్లపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, కంపెనీ మాత్రం తన దృష్టిని మిడ్-రేంజ్ విభాగంపై కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 07, 2026న భారతదేశంలో విడుదల కానుంది. ఈ లాంచ్ ద్వారా భారత మార్కెట్‌లో తాము యాక్టివ్‌గా ఉంటామనే సంకేతాన్ని కంపెనీ ఇస్తోంది. నాయకత్వ మార్పుల ప్రభావం ఉత్పత్తుల నాణ్యత లేదా సేవపై పడకుండా జాగ్రత్త పడుతున్నామని వన్‌ప్లస్ యాజమాన్యం వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share