యుద్ధం ఏదైనా.. ఐక్యంగా ఎదుర్కొందాం.
• అప్రమత్తంగా ఉండాలి, వదంతులు నమ్మొద్దు.
• గల్ఫ్ దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు.. మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు.
ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఎటువంటి పరిస్థితులు తలెత్తినా, 140 కోట్ల మంది భారతీయులు ఒకే తాటిపై నిలిచి ఐక్యంగా ఎదుర్కొంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం తన 132వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నది నిస్సందేహంగా సవాల్‌తో కూడిన సమయమేనని, అయితే భారతీయుల ఐక్యత ముందు ఏ సంక్షోభమైనా చిన్నబోవాల్సిందేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని, వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచ ఇంధన అవసరాలకు ప్రధాన వనరు అని, అక్కడ జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఇతర దేశాలతో నిర్మించుకున్న బలమైన దౌత్య సంబంధాలు ఇప్పుడు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని వివరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ పూర్తి నిబద్ధతతో సిద్ధంగా ఉందని, ఇతర దేశాల సహకారం వల్ల మన దేశం సుస్థిరమైన స్థితిలో ఉందని మోదీ పేర్కొన్నారు.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌కు సమీపంలోనే గత నెల రోజులుగా భీకర యుద్ధం జరుగుతుండటం ఆందోళనకరమని, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన కోటి మందికి పైగా భారతీయుల క్షేమం కోసం వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వేచి చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ విపత్కర సమయంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ, వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న గల్ఫ్ దేశాల ప్రభుత్వాలకు ప్రధాని మోదీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆయా దేశాల నాయకత్వం ప్రదర్శించిన చొరవ, భారతీయుల పట్ల వారు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని ఆయన కొనియాడారు.
యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక, సామాజిక పరిణామాలను తట్టుకునే శక్తి భారత్‌కు ఉందని, ఈ గడ్డు కాలాన్ని దాటి దేశం మరింత దృఢంగా ముందుకు సాగుతుందని మోదీ ఆకాంక్షించారు. దేశ ప్రజలందరి సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యమని, అంతర్జాతీయ వేదికలపై భారత్ తన గళాన్ని శాంతి కోసం వినిపిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకరికొకరు తోడుగా ఉంటూ, దేశ సమగ్రతను చాటి చెప్పాలని ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా సందేశాన్ని ఇచ్చారు.







