* హరీష్ రావునే బలి చేస్తున్నారు.
* అవినీతి కేసుల విచారణ అంతా ‘తూతూ మంత్రం’.
* కేసీఆర్ కుటుంబానికి సీఎం రక్షణ కవచం.
* కాళేశ్వరం లక్ష కోట్ల దోపిడీపై ఎందుకు మౌనం?.
* కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే వారిద్దరూ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి ప్రభుత్వం వెళ్లకపోవడానికి ఈ ‘డీల్’ కారణమని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి కేవలం హరీష్ రావును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
**హరీష్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు**
కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, మరి ఇప్పుడు కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన రూ.9 వేల కోట్ల అవినీతిపైనే ఎందుకు విచారణ కోరుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం హరీష్ రావు పాత్ర ఉన్న అంశాలకే విచారణను పరిమితం చేస్తూ, కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్న మిగతా భారీ అవినీతిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, కవితల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రేవంత్ రెడ్డి మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.
**ఇద్దరి మధ్య కుదిరిన ‘డీల్’ అదేనా?**
బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్ కనుసన్నల్లోనే అంతా సాగిందని, నాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపిన విషయాన్ని ఆయన మర్చిపోయారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. “కేటీఆర్‌పై రేవంత్ రెడ్డికి ఇప్పుడు అమితమైన ప్రేమ పుట్టుకొస్తోంది. ఫార్ములా-ఈ రేసింగ్, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసుల గురించి సీఎం ఎందుకు మాట్లాడటం లేదు?” అని నిలదీశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకే హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. మైనింగ్ స్కామ్ వంటి అంశాలపై విచారణలన్నీ కేవలం “గతంలో మీరు దోచుకున్నారు.. ఇప్పుడు మేము దోచుకుంటాం.. నోరు మెదపవద్దు” అని బెదిరించడానికే తప్ప, అవినీతిని వెలికితీసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
**బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రశ్నే లేదు**
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడే బీజేపీ, అవినీతిలో కూరుకుపోయిన బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయ వారసులకు టికెట్లు ఇవ్వబోమని ప్రధాని మోదీ ఇప్పటికే తేల్చిచెప్పారని గుర్తు చేశారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు వార్తలతో రేవంత్ రెడ్డిలో వణుకు మొదలైందని, ఆ డిప్రెషన్‌తోనే ఆయన దక్షిణాది, ఉత్తరాది అనే భేదాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.
**ఐదు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఖాయం**
రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించబోతోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అస్సాం, పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళలోనూ బీజేపీ అద్భుత ఫలితాలను సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ఏ ఒక్క రాష్ట్రంలోనూ గెలిచే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు.







