Mahaa Daily Exclusive

  ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం..

Share

  • ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం
  •  10 రోజుల పాటు సాగిన కార్యకలాపాలు.. నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్.

హైదరాబాద్, మహా.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. సభలో చివరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లు – 2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మొత్తం పది రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఈ బడ్జెట్ సెషన్‌లో సభా కార్యకలాపాలు మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు కొనసాగాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం మొత్తం 11 బిల్లులను సభ ముందు ఉంచగా, అందులో 10 బిల్లులకు శాసనసభ పచ్చజెండా ఊపింది. మరో బిల్లును మాత్రం తదుపరి పరిశీలన నిమిత్తం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు సామాజిక భద్రత కల్పించే ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు – 2026, న్యాయవాదుల భద్రతకు ఉద్దేశించిన అడ్వకేట్ల పరిరక్షణ బిల్లు – 2026 వంటి కీలక చట్టాలకు సభ ఆమోదముద్ర వేసింది.

బిల్లులతో పాటు మూడు ముఖ్యమైన ప్రభుత్వ తీర్మానాలను కూడా సభ ఆమోదించింది. వివిధ శాఖల పద్దులపై చర్చలు, ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల అనంతరం బడ్జెట్ సమావేశాలకు తెరపడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, ఆర్థిక కేటాయింపులపై ఈ సమావేశాల్లో లోతైన చర్చలు జరిగాయి.

Latest