- అసెంబ్లీని కుస్తీ పోటీగా మార్చిన రేవంత్ రెడ్డి..
- ప్రజా సమస్యలపై చర్చలేవి?
- కేరళ ఎన్నికల కోసం సభ వాయిదా.
- కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట.
హైదరాబాద్, మహా.
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు బాధ్యతాయుతమైన విధానాలకు బదులుగా ‘పహిల్వాన్’ భాషను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పవిత్రమైన సభలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాల గురించి చర్చ జరగాలి కానీ, కుస్తీ పోటీలు కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు నడుపుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తులతో కోలాటంలో తలలు తీసేస్తామంటూ మరో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అనాగరిక వ్యాఖ్యలను తక్షణమే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని, గత రెండున్నర ఏళ్లుగా రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సభను నిర్వహించే తీరుపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ బ్రేక్ పేరుతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని, ముఖ్యమంత్రి కేరళ నుంచి వస్తున్నారని, ఆర్థిక మంత్రి ప్రిపేర్ కావాలంటూ రకరకాల కుంటి సాకులతో గంటల తరబడి సభను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. విలువైన సమయాన్ని వృథా చేస్తూ, కావాలనే సభను అర్ధరాత్రి వరకు నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం శాసనసభను 30వ తేదీనే నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి కేరళ ఎన్నికలు ముఖ్యం కావొచ్చేమో కానీ, బీఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ ప్రజలు, వారి సమస్యలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దానిని తాము నిలదీస్తూనే ఉంటామని హరీశ్ రావు హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఒకే బాటలో పయనిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురదజల్లడమే లక్ష్యంగా ఇద్దరి మాటలు ఉన్నాయని, వీరి వ్యాఖ్యలకు పెద్దగా తేడా లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని, సుప్రీంకోర్టు సహా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ వంటి వారు దీనిని తెలంగాణకు వరప్రదాయినిగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇటీవల పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో కూడా కాళేశ్వరం వల్ల సాగు భూమి పెరిగిందని అంగీకరించారని తెలిపారు. సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన నివేదికలోనూ గత రెండేళ్లలో సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారని, ముసీకి వచ్చే గోదావరి నీళ్లు కూడా కాళేశ్వరం నుంచి వస్తున్నవేనని వివరించారు.
రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని హరీశ్ రావు ఎండగట్టారు. మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తే అదనంగా రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని, గత రెండేళ్లుగా 20 సార్లు లేఖలు రాసినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంపై కోపం ఉంటే రాజకీయంగా తీర్చుకోవాలి తప్ప, ఆ కోపాన్ని రైతుల మీద చూపించి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సరికాదని హితవు పలికారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన స్పష్టం చేశారు. సీఆర్ పాటిల్ తెలంగాణ రైతుల్ని అడిగితే సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుందో వాస్తవాలు తెలుస్తాయని సూచించారు.








