Mahaa Daily Exclusive

  అమరావతికి చట్టబద్ధ ముద్ర.. లోక్‌సభలో నేడు విభజన చట్ట సవరణ బిల్లు..

Share

  • ఏపీ ఏకైక రాజధానిగా అధికారిక గుర్తింపు.
  •  సెక్షన్‌ 5(2) సవరణకు కేంద్రం సిద్ధం.
  •  జూన్‌ 2, 2024 నుంచే అమల్లోకి వచ్చేలా నిబంధన.
  •  రాజధానిపై సందిగ్ధతకు తెర.

 

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక అడుగు వేయనుంది. విభజన జరిగిన పుష్కర కాలం తర్వాత, ఏపీ రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చట్టంలో చేర్చేందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు 2026’ను కేంద్రం సిద్ధం చేసింది. ఈ కీలక బిల్లును బుధవారం (ఏప్రిల్ 1) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దశాబ్ద కాలంగా రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయ, రాజకీయ సందిగ్ధతకు ఈ సవరణతో శాశ్వతంగా తెరపడనుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించేందుకు చేపట్టిన ప్రయత్నాలకు కేంద్రం నుంచి ఈ రూపంలో గట్టి మద్దతు లభించినట్లయింది.

ఈ సవరణ బిల్లు ద్వారా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో భారీ మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం చట్టంలో ఉన్న ‘రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అనే సాధారణ వాక్యం స్థానంలో, ఇకపై ‘అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అని స్పష్టంగా పొందుపరచనున్నారు. కేవలం పేరును చేర్చడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చట్టం-2014 ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ అమరావతి పరిధిలోకి వస్తాయని బిల్లులో వివరించారు. దీనివల్ల రాజధాని విస్తీర్ణం, పరిధిపై భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చట్టపరమైన రక్షణ లభించనుంది.

ఈ బిల్లులోని మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ సవరణను గతకాలం నుంచి అంటే జూన్ 2, 2024 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించనున్నారు. అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అమరావతి అధికారిక రాజధానిగా గుర్తింపు పొందినట్లు అవుతుంది. ఇటీవలే మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై, పునర్విభజన చట్టాన్ని సవరించి అమరావతి పేరును చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2022 మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ తీర్మాన ప్రతిని కేంద్ర హోంశాఖకు, పార్లమెంటు ఉభయ సభల అధ్యక్షులకు పంపగా, కేంద్రం వెనువెంటనే స్పందించి ఈ బిల్లును రూపొందించింది.

అమరావతిని రాజధానిగా చట్టంలో చేర్చడం ద్వారా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు వీలు కలుగుతుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపులు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి వచ్చే రుణాలకు ఈ చట్టబద్ధత ఎంతో కీలకం కానుంది. గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో నెలకొన్న అనిశ్చితి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినడమే కాకుండా పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కేంద్రమే నేరుగా చట్ట సవరణకు మొగ్గు చూపడంతో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా, భూములిచ్చిన రైతులకు కూడా భరోసా లభించినట్లయింది. రేపు లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలిచిపోనుంది.

Latest