- జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాల పంట.
- గ్రామ స్వరాజ్యంలో దేశంలోనే ప్రథమ స్థానం.
- జల సంరక్షణలోనూ అగ్రగామి.
- 24వ ర్యాంకు నుంచి నెంబర్ వన్‌కు.
- పవన్ కల్యాణ్ మార్క్ పాలనకు దక్కిన గౌరవం.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటి దేశం దృష్టిని ఆకర్షించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఈ శాఖ చేపట్టిన విప్లవాత్మక మార్పులకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, పారదర్శక పాలన అందించడంలో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ గౌరవాన్ని అందించింది. మంగళవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.
ముఖ్యంగా ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్’ , ‘జల్ సంచయ్-జన్ భాగీదారి’ అనే రెండు కీలక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ విభాగంలో 24వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, నిధుల వినియోగంలో జవాబుదారీతనం పెంచడం ద్వారా ఈ ఘనత సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. అలాగే, వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తూ ఏపీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ‘పల్లెలే రాష్ట్రానికి ప్రాణాధారం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రతిష్టాత్మకంగా ‘పల్లెపండుగ 1.0’, ‘పల్లెపండుగ 2.0’ వంటి కార్యక్రమాలను ప్రారంభించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒకే రోజు వేల సంఖ్యలో గ్రామసభలు నిర్వహించి, నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామసభల ద్వారా వచ్చిన వినతులను పరిష్కరిస్తూ ‘పల్లెవెలుగు’ పథకం కింద సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు.
మరో మూడు విభాగాల్లోనూ ఏపీ తన ప్రతిభను చాటుకుంది. ఒక విభాగంలో ద్వితీయ స్థానం, మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానాలను కైవసం చేసుకుని మొత్తం ఐదు అవార్డులతో జాతీయ స్థాయిలో మెరిసింది. అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా పర్యవేక్షిస్తున్న పవన్ కల్యాణ్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా అభివృద్ధి పనులను సమన్వయం చేయడం ఈ విజయానికి మరో ప్రధాన కారణమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి లభించిన ఈ గుర్తింపు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలతో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.








