- ఇప్పటివరకు 5.72 లక్షల మంది స్వదేశానికి.
- సురక్షితంగా 959 మంది నావికులు.
ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి సుమారు 5.72 లక్షల మంది ప్రయాణికులు క్షేమంగా భారత్‌కు చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఖతార్ గగనతలం పాక్షికంగా పునరుద్ధరించబడటంతో, నేడు సుమారు 8 నుంచి 10 ప్రత్యేక వాణిజ్య విమానాలు భారత్‌కు రానున్నాయని అధికారులు తెలిపారు. భారతీయుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి రోజుకు సగటున 85 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా, ఒమన్ మరియు సౌదీ అరేబియా నుంచి కూడా విమాన సర్వీసులు యధాతథంగా నడుస్తున్నాయి. అయితే కువైట్, బహ్రెయిన్ గగనతలాలు ఇంకా మూసివేసే ఉండటంతో ఆ మార్గాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో గగనతలం మూసివేత కారణంగా ప్రయాణికులను ఆర్మేనియా, అజర్బైజాన్, జోర్డాన్ మరియు సౌదీ అరేబియా మీదుగా మళ్లించి స్వదేశానికి చేరుస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని భారతీయుల కోసం ఈజిప్ట్, జోర్డాన్ మార్గాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయాలు స్థానిక భారతీయ సమాజంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నాయి.
మరోవైపు సముద్ర జలాల్లో ఉన్న భారత నావికుల భద్రతపై పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 18 భారతీయ నౌకల్లో 485 మంది సిబ్బంది ఉన్నారని, వీరి పరిస్థితిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిశితంగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది. గత 24 గంటల్లో భారత పతాక నౌకలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, ఇప్పటివరకు మొత్తం 959 మంది నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని వెల్లడించింది. వీరిలో గత 24 గంటల్లోనే 9 మంది తిరిగి వచ్చారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ భారత్‌లోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా, సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.








