Mahaa Daily Exclusive

  తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటోన్న కాంగ్రెస్‌..ఎమ్మెల్యే పాయల్‌ శంకర్…

Share

  • ‘శాసనసభ సమావేశాల తీరుపై విచారం.
  •  బడ్జెట్‌ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను జాతీయ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చేసిందని ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఇక్కడి నిధులను ఇతర రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రచారానికి తరలిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరగాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చాక కేవలం 10 రోజుల్లోనే మమ అనిపించడం ప్రజలను వంచించడమేనని విమర్శించారు. శాసనసభ వేదికగా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని, మంత్రులు సమాధానాలు చెప్పకుండా విపక్షాలపై ఎగతాళిగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పాయల్ శంకర్ తప్పుబట్టారు. జాతీయ గీతం, వందేమాతరంను అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని ప్యానల్‌ స్పీకర్‌గా నియమించడం దేశానికే అవమానకరమని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా ఉందని, సాగు చేయలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. రైతు బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, వారు కట్టిన నిధులు సైతం అందక వైద్య అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.

కాగ్ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనం బయటపడిందని పాయల్ శంకర్ ఎత్తిచూపారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 60 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల పేరుతో అప్పులు తీసుకుంటూ వాటిని బలహీనపరుస్తున్నారని, మూడేళ్లుగా ఆడిట్ కూడా జరగని సంస్థలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని 53 వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్‌పై 2014 నుంచి సర్వేలు నిర్వహించలేదన్న కాగ్ హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లులు చెల్లించి, వారి ద్వారా వచ్చే కమీషన్లను ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మిలాఖత్ అయ్యాయని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణే నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిన ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణ కోరితే, కేవలం రూ. 10 వేల కోట్ల విలువైన బ్యారేజీల పనులకే పరిమితం చేయడం వెనుక గత ప్రభుత్వాన్ని కాపాడే ఉద్దేశం కనిపిస్తోందని విమర్శించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకే ఇక్కడి ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేలా పాలన సాగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, కప్పర ప్రసాదరావు, మీడియా ప్యానెలిస్టులు రాజు ముదిరాజ్, ప్రభా గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest