హైదరాబాద్, మహా.
తనను ‘అన్నయ్య’ అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఒక యువకుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నగరానికి చెందిన మహ్మద్ ఫహాద్‌గా గుర్తించారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఫహాద్, తన బంధువుల కుమార్తెపై ఈ అకృత్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఆ చిన్నారి తనను ఎంతో నమ్మకంతో ‘భయ్యా’ అని పిలుస్తున్నప్పటికీ, కనికరం లేకుండా ప్రవర్తించిన నిందితుడు, ఆ అసభ్యకర దృశ్యాలను ఇంటర్నెట్‌లో ఉంచాడు.
ఈ వీడియో అప్‌లోడ్‌కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడియో అప్‌లోడ్ చేసిన ఐపీ అడ్రస్‌లను అత్యంత వేగంగా ట్రేస్ చేశారు. నిందితుడి ఆచూకీని కనిపెట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నపిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. బాధితురాలికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.








