Mahaa Daily Exclusive

  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..

Share

  •  34 మంది లొంగుబాటు.
  •  ముగిసిన ‘ఆపరేషన్‌ కగార్‌’.
  •  భారీగా ఆయుధాలు, కిలోల కొద్దీ బంగారం, కోట్లాది నగదు స్వాధీనం.

రాయ్‌పుర్‌, మహా.

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టుల ప్రాబల్యానికి గట్టి దెబ్బ తగిలింది. ప్రధాన స్రవంతిలో కలవాలన్న ప్రభుత్వ పిలుపునకు స్పందిస్తూ మంగళవారం ఏకంగా 34 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామంతో అటవీ ప్రాంతాల్లో విప్లవ ముఠాల కార్యకలాపాలకు పెద్ద విఘాతం కలిగింది. లొంగిపోయిన వారిలో పలువురు కీలక కేడర్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. వీరి నుంచి సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టులు దాచిన భారీ ఆయుధ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో దిగ్భ్రాంతి కలిగించే స్థాయిలో సంపద, మందుగుండు సామగ్రి బయటపడింది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 93 అత్యాధునిక ఆయుధాలతో పాటు సుమారు ఏడు కిలోల బంగారం, రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల నగదు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులకు ఆర్థికంగా, సైనికపరంగా ఇది కోలుకోలేని దెబ్బ అని భద్రతా బలగాలు విశ్లేషిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ ఉంచిన ఈ సొత్తును పోలీసులు అత్యంత చాకచక్యంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో తిష్టవేసిన ఉగ్రవాద శక్తులను ఏరివేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ నేటితో ముగిసింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ముగింపు రోజైన మంగళవారమే ఇంత భారీ స్థాయిలో లొంగుబాటు జరగడం విశేషం.

మావోయిస్టుల కదలికలను పూర్తిగా అరికట్టేందుకు, వారి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ‘ఆపరేషన్‌ కగార్‌’ ద్వారా భద్రతా బలగాలు నిరంతర సోదాలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టుల బలం గణనీయంగా తగ్గిందని, అడవి బాటను వీడి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన 34 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస ప్యాకేజీలు అందజేస్తామని, ఇప్పటికైనా మిగిలిన వారు అయుధాలను వీడి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని పోలీసు యంత్రాంగం పిలుపునిచ్చింది. ఈ భారీ స్వాధీనం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Latest