- పశ్చిమాసియా యుద్ధంపై నోబెల్ గ్రహీత ఆవేదన.
- పోప్ విజ్ఞప్తికి సంపూర్ణ మద్దతు.
ధర్మశాల, మహా.
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఏ గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయంలోనూ హింసకు తావులేదని, అన్ని మతాలు ప్రాథమికంగా శాంతి, సహనం, కరుణనే బోధిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని కోరుతూ పోప్ లియో-14 చేసిన విజ్ఞప్తిని దలైలామా మనస్ఫూర్తిగా సమర్థించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పామ్ సండే ప్రార్థనల సందర్భంగా పోప్ లియో-14 చేసిన ప్రసంగం తనను ఎంతగానో కదిలించిందని దలైలామా పేర్కొన్నారు. శాంతి కోసం ఆయుధాలను వీడాలని, హింసను త్యజించాలని పోప్ ఇచ్చిన పిలుపు అన్ని మతాల సారాంశమని ఆయన అభివర్ణించారు. క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం, హిందూ, యూదు మతాలతో పాటు ప్రపంచంలోని ఏ మతాన్నైనా పరిశీలిస్తే ప్రేమ, కరుణ, ఆత్మనిగ్రహం అనే ఉమ్మడి విలువలనే కనిపిస్తాయన్నారు. హింస ఎప్పటికీ శాశ్వత శాంతికి పునాది కాలేదని, అది మరింత హింసను మాత్రమే సృష్టిస్తుందని చరిత్ర మనకు పదేపదే హెచ్చరిస్తోందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంఘర్షణలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని దలైలామా అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మనం ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులమనే అవగాహనతో శాంతి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రసంగించిన పోప్ లియో-14, యుద్ధం చేసేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడని, ఆయన ఎల్లప్పుడూ పీడితుల పక్షాన నిలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యేసు క్రీస్తు శాంతికి రాజని, ఆయన యుద్ధాన్ని ఎన్నటికీ సమర్థించరని పోప్ స్పష్టం చేశారు.
కాగా, పోప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశం దాదాపు 250 ఏళ్ల క్రితం యూదు-క్రైస్తవ విలువల పునాదిపైనే ఏర్పడిందని ఆమె గుర్తుచేశారు. దేశ చరిత్రలో క్లిష్ట సమయాల్లో అధ్యక్షులు, సైనికాధికారులు ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేశం కోసం, సైనికుల క్షేమం కోసం ప్రార్థించాలని ప్రజలకు పిలుపునివ్వడం అత్యంత గొప్ప కార్యమని, అందులో ఎలాంటి తప్పు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.








