- అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క.
హైదరాబాద్, మహా: తెలంగాణలో మహిళా సాధికారత దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం వేసిన అడుగులు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ప్రయాణించి, తద్వారా 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.
మహిళా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. మహిళలు ఆదా చేసుకున్న ఈ రూ. 10 వేల కోట్లు వారి కుటుంబ ఆర్థిక అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. కేవలం బస్సు ప్రయాణమే కాకుండా, మహిళలను లక్షాధికారులను చేయడమే మా లక్ష్యం. రాబోయే 3 ఏళ్లలో మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించబోతున్నాం. మహిళలు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది,” అని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులంతా మా కుటుంబ సభ్యులే.
మంత్రి పొన్నం ప్రభాకర్
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర మరువలేనిది. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులలో 40 లక్షల మంది మహిళలే ఉండటం గొప్ప విషయం. ఆర్టీసీని కాపాడుకుంటూనే మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటికే ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్త బస్సులు, కొత్త రూట్ల ఏర్పాటుతో సంస్థను మరింత బలోపేతం చేస్తాం,” అని హామీ ఇచ్చారు.
రాజకీయ విమర్శలకు మహిళలే సమాధానం చెప్పాలి
మంత్రి సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణాన్ని విమర్శించే వారికి మహిళలు తమ తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు,” అని ధీమా వ్యక్తం చేశారు.
అనంతర మహిళలు పొదుపు చేసుకున్న రూ. 10,000 కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, సెర్ఫ్ సీఈవో దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు సిహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్ , రాజశేఖర్ పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.








