Mahaa Daily Exclusive

  ఆన్‌లైన్ మోసాలపై సైబర్ పోలీసుల ఉక్కుపాదం…వందల సంఖ్యలో నకిలీ ప్రొఫైళ్లు, ప్రకటనల తొలగింపు.

Share

  •  బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట వల.. నిందితుల కోసం ముమ్మర వేట.

హైదరాబాద్‌, మహా.

అమాయక ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న బెట్టింగ్‌, గేమింగ్‌, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, తాజాగా భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకునే క్రమంలో వందల సంఖ్యలో నకిలీ ప్రొఫైళ్లను, వేలల్లో ప్రకటనలను తొలగించి సైబర్ నేరగాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

దర్యాప్తులో భాగంగా బెట్టింగ్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట తప్పుడు వాగ్దానాలతో ప్రకటనలు ఇస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ప్రొఫైళ్ల సాయంతో నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్‌లను ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. కేవలం ఈ ఖాతాల నుంచే సుమారు 494 పెయిడ్ అడ్వర్టయిజ్‌మెంట్లు (రుసుము చెల్లించిన ప్రకటనలు) నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అక్రమ కార్యకలాపాలపై తక్షణమే స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రాథమికంగా గుర్తించిన 129 ప్రొఫైళ్లను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించారు. వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 209 సోషల్ మీడియా ప్రొఫైళ్లు, మొత్తం 746 పెయిడ్ ప్రమోషనల్ ప్రకటనలను బ్లాక్ చేయించారు.

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ ఆశచూపే ఇలాంటి నకిలీ వెబ్‌సైట్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి, భారీగా ప్రకటనలు ఇస్తూ అమాయకులను వంచిస్తున్న నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఈ ముఠా మూలాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త వహించాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Latest