- ఏప్రిల్ 25న ఆవిర్భావం.. ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో వరుస భేటీలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన ఆమె, రేపటి నుంచి తన అనుచర వర్గం, తెలంగాణ జాగృతి శ్రేణులతో విస్తృత స్థాయిలో సమాలోచనలు నిర్వహించనున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ లోపు పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె దృష్టి సారించారు.
ఈ క్రమంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో కవిత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలలో ప్రధానంగా తెలంగాణ జాగృతికి చెందిన కీలక నాయకులు, జిల్లాల స్థాయి కార్యకర్తలు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జాగృతి కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా వంటి అంశాలపై కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలను కవిత స్వయంగా స్వీకరించనున్నారు.
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వం కోసం పోరాడిన జాగృతి సంస్థను రాజకీయ శక్తిగా మార్చడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించే ఈ సమీక్షా సమావేశాలు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఏప్రిల్ 25న నిర్వహించబోయే ప్రకటనకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లపై కూడా ఈ భేటీలలో దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.








