Mahaa Daily Exclusive

  వరంగల్‌ జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. కట్టుకున్న భార్యపైనే ‘కక్ష’పూజలు..!

Share

  • కట్టుకున్న భార్యపైనే ‘కక్ష’పూజలు!
  •  వడ్లకొండ ఆలయ సమీపంలో ఆనవాళ్లు.
  •  భర్తపై బాధితురాలి ఫిర్యాదు.

పర్వతగిరి, మహా.

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న క్షుద్రపూజల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను వదిలించుకోవాలనే దుర్బుద్ధితో ఓ భర్త అమానుషానికి ఒడిగట్టడం భయాందోళనలకు గురిచేసింది. గ్రామ శివారులోని ప్రసిద్ధ కంఠమహేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఉన్న ఓ మర్రి చెట్టు కింద ఈ క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

గ్రామ శివారులో పూజలు జరిగిన ప్రాంతంలో మద్దెబోయిన కవిత అనే మహిళకు చెందిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లభించింది. ఆ ఫోటోపై కుంకుమ చల్లి, క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై భక్తులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పర్వతగిరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మూఢనమ్మకాలతో ఇతరుల ప్రాణాలకు హాని తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై బాధితురాలు కవిత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త రాజుపై సంచలన ఆరోపణలు చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, తనను మరియు పిల్లలను చంపేయాలనే ఉద్దేశంతోనే ఈ పూజలు చేయించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి క్షుద్రపూజల వల్లే తన ఒక కుమారుడు మరణించాడని, ఇప్పుడు తనపై, తన కూతురిపై కక్షగట్టాడని కన్నీటిపర్యంతమయ్యారు. భర్త అక్రమ సంబంధంపై గతంలో కోర్టును ఆశ్రయించగా, పిల్లల పేరు మీద వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చిందని, ఆ భూమిని దక్కించుకోకుండా చేసేందుకే తమను వదిలించుకోవాలని భర్త ఈ కుట్ర పన్నాడని ఆమె పేర్కొన్నారు. నిందితుడైన రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest