- మే నెలలో వేసవి సెలవులు
- మధ్యాహ్నం 12.30 గంటల వరకే కేంద్రాల నిర్వహణ.
- సిబ్బందికి ప్రభుత్వం ఉత్తర్వులు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు రేపటి (ఏప్రిల్ 1) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్ట్యా చిన్నారి పిల్లల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఒంటిపూట కేంద్రాలు కొనసాగుతాయని, ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే అంగన్వాడీలు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. సెలవుల సమయంలో పిల్లలకు పౌష్టికాహార లోపం కలగకుండా ఉండేందుకు ‘టేక్ హోమ్ రేషన్’ (టీహెచ్ఆర్) పంపిణీ చేయాలని ఆదేశించింది. అంగన్వాడీ సిబ్బంది నేరుగా లబ్ధిదారులైన పిల్లల ఇళ్లకు వెళ్లి ఈ రేషన్ సామగ్రిని అందజేయాలని సూచించింది. జూన్ నెలలో తిరిగి యథావిధిగా కేంద్రాలు ప్రారంభమవుతాయని, తల్లిదండ్రులు ఈ సమయ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు. కేంద్రాల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించకుండా చూడాలని పర్యవేక్షక అధికారులకు ఆదేశాలు అందాయి.








