Mahaa Daily Exclusive

  కన్నప్రేమ కలుషితం..! కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రిలో దారుణం…

Share

  •  ఫ్లష్‌ట్యాంకులో పసికందు మృతదేహం.
  •  కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రిలో దారుణం..  కనికరం లేని కన్నతల్లి?

హైదరాబాద్‌, మహా.

 

కన్నప్రేమ కలుషితమైంది. నవమాసాలు మోసి, ప్రాణం పోయాల్సిన తల్లి.. లోకనిందకు భయపడిందో లేక మరేదైనా కారణమో కానీ, పసికందు అన్న కనికరం లేకుండా ఆ అభాగ్యుడిని మృత్యువు ఒడిలోకి నెట్టింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావు ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన మనిషిలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఆసుపత్రిలోని టాయిలెట్ ఫ్లష్‌ట్యాంకులో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పసికందు ప్రాణాలు గాలిలోనే కలిసిపోవడం చూసి ఆసుపత్రి సిబ్బంది, రోగులు కన్నీటిపర్యంతమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. గుర్తుతెలియని మహిళ ఒకరు ఆసుపత్రికి వచ్చి, టాయిలెట్‌లోనే శిశువుకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఎవరికీ తెలియకుండా, అప్పుడే పుట్టిన ఆ మగ బిడ్డను కిరాతకంగా టాయిలెట్ ఫ్లష్‌ట్యాంకులో వేసి అక్కడి నుంచి పరారైంది. ఆసుపత్రి సిబ్బంది టాయిలెట్‌ను గమనించిన సమయంలో ఫ్లష్‌ట్యాంకులో పసికందు మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ పసికందును రక్షించే అవకాశం కూడా లేకుండా పోవడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చిన అనుమానిత మహిళల వివరాలు, పరిసరాల్లోని సీసీ కెమెరాల రికార్డింగ్‌లను తనిఖీ చేస్తున్నారు. లోకనిందకు భయపడి ఇలాంటి సాహసానికి ఒడిగట్టిందా లేక మరేదైనా నేపథ్యం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Latest