- సిద్దిపేట అన్నదాతలకు ఊరట.
- హరీశ్‌రావు విజ్ఞప్తికి మంత్రి ఉత్తమ్ సానుకూల స్పందన.. 1.5 టీఎంసీల పంపింగ్‌కు ఆదేశం.
హైదరాబాద్/సిద్దిపేట, మహా.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుత యాసంగి పంట కాలం పూర్తయ్యే వరకు పంట పొలాలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్‌లోకి మరో 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మంత్రి ఉత్తమ్‌ను కలిసి అందించిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
సిద్దిపేట నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా యాసంగి సీజన్‌లో రంగనాయక సాగర్ కాలువల ద్వారా క్రమం తప్పకుండా సాగునీరు అందుతోందని, దీనివల్ల ఈ ప్రాంతంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని హరీశ్‌రావు తన లేఖలో మంత్రికి వివరించారు. ప్రస్తుత యాసంగిలో సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, సాగునీటి అవసరాల దృష్ట్యా గతంలో ప్రభుత్వం 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం రంగనాయక సాగర్‌లో కేవలం 1.00 టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉందని, పంటలు పూర్తిగా చేతికి అందాలంటే మరో 1.5 టీఎంసీల నీటి అవసరం ఉందని హరీశ్‌రావు రైతుల పక్షాన విన్నవించారు.
సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, గత ఐదేళ్లుగా అనుసరిస్తున్న విధానం ప్రకారమే ఈ ఏడాది కూడా పంట కాలం ముగిసే వరకు నీటిని పంపింగ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి తక్షణమే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటి పంపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సిద్దిపేట పరిధిలోని వేలాది మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందుబాటులోకి రానుండటంతో 50 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోకుండా సురక్షితంగా చేతికి అందుతాయని అన్నదాతలు ఆశీభావం వ్యక్తం చేస్తున్నారు.








