Mahaa Daily Exclusive

  వికసిత కేరళే లక్ష్యం.. భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల…

Share

  • భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల.
  •  ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’.
  •  రాజకీయాలకు చరమగీతం పాడాలి: నితిన్‌ నబిన్‌.
  •  నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీరు..
  •  శబరిమల రక్షణకు ప్రత్యేక మిషన్..
  •  ప్రతిభావంతులైన యువతకు భరోసా.

తిరువనంతపురం, మహా:

కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా భారతీయ జనతా పార్టీ కీలక అడుగు వేసింది. ‘వికసిత కేరళ’ లక్ష్యంగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను తిరువనంతపురంలోని శ్రీ మూలం క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో దశాబ్దాలుగా ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల మధ్య సాగుతున్న ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంగా నటిస్తూ ప్రజలను వంచిస్తున్నారని, ఈ రెండు కూటముల అవినీతి, బుజ్జగింపు రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు భాజపా ఒక దార్శనిక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా ఓట్ల శాతం గణనీయంగా పెరగడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో అనేక విప్లవాత్మక హామీలను పొందుపరిచారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటిని సరఫరా చేస్తామని, నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు నెలకు రూ. 3,000 చొప్పున సంక్షేమ పెన్షన్ అందజేస్తామని నబిన్ ప్రకటించారు. నిరుపేద కుటుంబాలకు ఓనం, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఏడాదికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పేద మహిళలకు ఔషధాలు, నిత్యావసరాల కోసం నెలకు రూ. 2,500 రీఛార్జ్ చేసే ‘భక్ష్య ఆరోగ్య సురక్ష’ కార్డులను అందజేస్తామని భరోసా ఇచ్చారు. కేరళ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే అవకాశాలు కల్పిస్తామని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేరళకు ‘ఏయిమ్స్’ (AIIMS) మంజూరుతో పాటు తిరువనంతపురం నుంచి కన్నూర్ వరకు హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని ఆయన వివరించారు.

ఆధ్యాత్మిక రంగంలో కేరళ అస్తిత్వాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు భాజపా ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. శబరిమల, గురువాయూర్ వంటి పుణ్యక్షేత్రాల గౌరవాన్ని కాపాడతామని, దేవస్థానం బోర్డులను ప్రక్షాళన చేసి ఆలయ నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచుతామని నబిన్ పేర్కొన్నారు. శబరిమలలో జరిగిన బంగారు ఆభరణాల చోరీపై సీబీఐ విచారణ జరిపిస్తామని, భక్తుల సౌకర్యార్థం ‘శబరిమల మౌలిక సదుపాయాల అభివృద్ధి మిషన్’ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేరళను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రధాన నగరాలను ప్రత్యేక ఆర్థిక హబ్‌లుగా మారుస్తామని ఆయన వెల్లడించారు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు మరియు చారిత్రక వారసత్వాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ పడబోమని, ప్రతి భక్తుడి మనోభావాలను గౌరవిస్తూ దేవాలయాల పవిత్రతను కాపాడతామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్‌తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు.

Latest