- కీలక ఖనిజాల్లో ‘ఆత్మనిర్భర’ సాధనే లక్ష్యం.
- రూ. 32వేల కోట్లతో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’.. రీసైక్లింగ్‌కు కేంద్రం పెద్దపీట.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ‘అర్బన్ మైనింగ్’.. లోహమ్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి
ఢిల్లీ, మహా.
క్రిటికల్ మినరల్ (కీలక ఖనిజాల) రంగంలో భారతదేశం స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్రముఖ ప్రైవేటు సంస్థ ‘లోహమ్’ పరిశోధనా కేంద్రంతో పాటు లిథియం, కోబాల్ట్ రిఫైనరీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా దేశ ఖనిజ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని వివరించారు. ముఖ్యంగా వినియోగించిన బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను పునశ్చక్రీకరణ (రీసైక్లింగ్) చేసే ప్రక్రియ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లోహమ్ సంస్థలోని సైంటిస్టులు, ఇంజినీర్లు, పరిశోధనా విభాగం సిబ్బందితో మంత్రి కిషన్ రెడ్డి సుదీర్ఘంగా ముచ్చటించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాలను వేరు చేసే ఆధునిక సాంకేతికతలను, వాటి పర్యావరణ ప్రయోజనాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రీసైక్లింగ్ ప్రక్రియలో లోహమ్ సంస్థ చూపుతున్న చొరవను అభినందించిన మంత్రి.. ఇలాంటి ప్రయత్నాల వల్ల విదేశీ దిగుమతులపై మన దేశం ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా దేశీయ సరఫరా గొలుసు (సప్లయ్ చైన్) మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కీలక ఖనిజాల కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగిందని, ఈ తరుణంలో రీసైక్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
దేశీయంగా ఖనిజ నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ‘అర్బన్ మైనింగ్’ అనే వినూత్న ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్ వ్యర్థాల్లో దాగి ఉన్న లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి అరుదైన మూలకాలను శాస్త్రీయంగా సేకరించి ప్రాసెస్ చేయడం ద్వారా అద్భుతమైన వనరులను సృష్టించవచ్చని ఆయన వివరించారు. దీనివల్ల అటు పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, ఇటు ఆర్థిక స్థిరత్వం కూడా సిద్ధిస్తుందని తెలిపారు. వ్యర్థాలను విలువైన సంపదగా మార్చే ఈ ‘సర్క్యులర్ ఎకానమీ’ విధానం దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు సాంకేతిక విప్లవానికి బాటలు వేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 32,000 కోట్ల భారీ వ్యయంతో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా ఖనిజాల అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్‌తో పాటు రీసైక్లింగ్ రంగాల్లో ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని ఖనిజ వనరుల కోసం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, దేశీయంగా పరిశోధనలు చేసే స్టార్టప్‌లకు, పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధానపరమైన మద్దతు, ప్రోత్సాహకాలు అందిస్తూ అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని, పరిశ్రమలు కూడా ప్రభుత్వంతో కలిసి నడిస్తే ఈ రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించడం తథ్యమని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు.






