Mahaa Daily Exclusive

  నారాయణపేట జిల్లాలో ఘోరం..! నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్య..

Share

  •  నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్య.
  •  వెండి పట్టీల కోసం పసిపాప ప్రాణం తీసిన కిరాతకులు.
  •  చెరువు వద్ద శవమై తేలిన నాలుగేళ్ల తేజశ్రీ

నారాయణపేట, మహా.

నారాయణపేట మండలంలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో అత్యంత అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. కేవలం కాళ్లకున్న వెండి పట్టీల కోసం దుండగులు నాలుగేళ్ల పసిపాపను పొట్టనబెట్టుకున్నారు. నిద్రిస్తున్న బాలికను అపహరించి, గొంతు నులిమి చంపిన ఉదంతం స్థానికంగా పెను కలకలం సృష్టించడమే కాకుండా గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది.

స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తేజశ్రీ (4) అనే బాలిక మంగళవారం రాత్రి తన అవ్వ, తాతలతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రిస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దుండగులు చడీచప్పుడు కాకుండా చిన్నారిని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరకు గ్రామ సమీపంలోని చెరువు వద్ద బాలిక నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు నిర్ఘాంతపోయారు.

బాలిక మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె కాళ్లకు ఉండాల్సిన వెండి పట్టీలు మాయమైనట్లు గుర్తించారు. దొంగతనానికి వచ్చిన దుండగులు, బాలిక కాళ్లకున్న వెండి పట్టీలను చూసి ఆశపడి, ఆమెను ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. తమను గుర్తుపడుతుందన్న భయంతోనో లేక అరుస్తుందన్న ఉద్దేశంతోనో పసిపాప అని కూడా చూడకుండా గొంతు నులిమి కిరాతకంగా చంపేసినట్లు తెలుస్తోంది. ఒక చిన్నారి ప్రాణం కంటే వెండి పట్టీలే ఎక్కువయ్యాయా అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిపాప మరణంతో అమ్మిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest