Mahaa Daily Exclusive

  పింఛన్ డబ్బుల కోసం ఘోరం..! పరిగిలో వృద్ధురాలి దారుణ హత్య..

Share

  •  పరిగిలో వృద్ధురాలి దారుణ హత్య.
  •  ఒంటరిగా ఉంటున్న విశ్రాంత ఏఎస్ఐ భార్య బలి.
  •  దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పరిగి, మహా.

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగంపల్లి గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. పింఛను డబ్బుల కోసం దుండగులు బరితెగించి, ఒక వృద్ధురాలిని కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పద్మమ్మ (65) అనే మహిళను నిందితులు లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. బుధవారం ఉదయం ఆమె తన నివాసంలో నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మృతురాలు పద్మమ్మ నేపథ్యం పరిశీలిస్తే ఆమె జీవితం తీవ్ర విషాదాలతో నిండి ఉంది. ఆమె భర్త గతంలో పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అనారోగ్యంతో మరణించిన కొన్నాళ్లకే, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పద్మమ్మ గత కొంతకాలంగా రంగంపల్లిలోని తన నివాసంలో ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. భర్తకు వచ్చే పెన్షన్ డబ్బులే ఆమెకు జీవనాధారంగా మారాయి. ఈ క్రమంలో, ఆమె వద్ద ఉన్న నగదును కాజేయాలనే దురాశతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హతమార్చి ఉంటారని గ్రామస్తులు గట్టిగా అనుమానిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో పద్మమ్మ ముఖం, ఛాతి భాగంలో బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దుండగులు ఆమెపై దాడి చేసి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ హత్య స్థానికంగా పెను కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Latest