Mahaa Daily Exclusive

  నాదర్‌గుల్‌లో ‘పొంగు’లేటి కబ్జా పర్వం.. రేపు ఉదయం కల్లా చర్యలు తీసుకోకపోతే ‘నాదర్‌గుల్’ ముట్టడిస్తాం.. హరీశ్ రావు హెచ్చరిక..

Share

  •  ఏడు వేల కోట్ల సర్కారు భూమి స్వాహా!
  •  హైడ్రాకు ‘మంత్రి’ ముసుగులో జరుగుతున్న భారీ కుంభకోణం కనిపించడం లేదా?
  •  పేద రైతులపై బౌన్సర్లతో దాడులు.. రక్షకులే భక్షకులుగా మారిన వైనం.
  •  రేపు ఉదయం కల్లా చర్యలు తీసుకోకపోతే ‘నాదర్‌గుల్’ ముట్టడిస్తాం.
  •  హరీశ్ రావు హెచ్చరిక

హైదరాబాద్, మహా.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారని, పారిశ్రామికవేత్తల ముసుగులో అధికార పార్టీ పెద్దలు ప్రభుత్వ భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నాదర్‌గుల్ భూ కుంభకోణంపై సంచలన ఆధారాలను బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613లో ఉన్న సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమిని, దాని విలువ అక్షరాలా 7 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పెద్దలు కబ్జా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ భారీ కుంభకోణం వెనుక సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. పేదల ఇళ్లు కూల్చేటప్పుడు ప్రతాపం చూపే ‘హైడ్రా’కు, మంత్రి కుటుంబం చేస్తున్న ఈ వేల కోట్ల కబ్జాలు ఎందుకు కంటికి కనిపించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఈ భూముల చరిత్రను వివరిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవి ప్రభుత్వ భూములని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ వీటిని కంటికి రేప్పలా కాపాడారని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే ఈ విలువైన భూములపై కన్ను పడిందని మండిపడ్డారు. తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతులను బౌన్సర్లను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మహిళా రైతులను రౌడీలతో బెదిరిస్తూ వారి బోర్లను, కంచెలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికార పార్టీ పెద్దలకు వత్తాసు పలుకుతూ రైతులపైనే అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయపరంగా ఈ భూమిపై ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. 2017లో సుప్రీంకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇవి ప్రభుత్వ భూములేనని, వీటి క్రయవిక్రయాలు చెల్లవని తేల్చి చెప్పాయని వివరించారు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఈ భూములను ఆల్ఫా, ఒమేగా వంటి కంపెనీలకు విక్రయించడం చెల్లదని కందుకూరు ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టులు సమర్థించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఏప్రిల్ 7న సుప్రీంకోర్టు విచారణలో ఉందని, ఎలాంటి స్టే లేనప్పటికీ హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మంత్రి కుటుంబం కబ్జాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భూభారతి వెబ్‌సైట్‌లో నేటికీ ఇది నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, ఆర్డీవో మరియు ఇతర అధికారులు కళ్లు మూసుకుని మంత్రుల కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే, నాదర్‌గుల్‌లో జరుగుతున్న ఈ అరాచకాన్ని అడ్డుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆ 373 ఎకరాల్లో 17 ఎకరాల ‘లచ్చమ్మ కుంట’ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని, 6 ఎకరాల బఫర్ జోన్ ఉందని, వాటన్నింటినీ ఈ కంపెనీలు ధ్వంసం చేశాయని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్ నిలిపివేసి, గుట్టలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ సాగిస్తున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సామాన్యుల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించే హైడ్రాకు, మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ‘శిల్పా ఇన్ఫ్రా’, ‘ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్’ వంటి కంపెనీల అక్రమ నిర్మాణాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.

ఈ కుంభకోణంపై హరీశ్ రావు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రేపు ఉదయం లోపు హైడ్రా అధికారులు నాదర్‌గుల్ చేరుకుని అక్రమ కంచెలను, బోర్డులను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తామే స్వయంగా రంగంలోకి దిగి నాదర్‌గుల్ భూములను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పేద రైతులను వారి భూముల్లోకి అనుమతించే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వ పెద్దల బండారాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన పిలుపునిచ్చారు. రక్షకులే భక్షకులుగా మారి వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని, తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి కబ్జాదారులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest