- అమెరికా సైన్యంపై చైనా కంపెనీల నిఘా.
- ఏఐ, ఓపెన్ సోర్స్ డేటాతో బలగాల కదలికల గుర్తింపు.
- ‘యుద్ధ క్షేత్రంలో వాషింగ్టన్ వ్యూహాలకు గండి.. ఆందోళనలో పెంటగాన్.
వాషింగ్టన్,మహా.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని అదృశ్య శత్రువు వణికిస్తున్నాడు. క్షేత్రస్థాయిలో క్షిపణుల కంటే శక్తిమంతమైన ‘డేటా’ ఆయుధంతో చైనా టెక్ కంపెనీలు అగ్రరాజ్యం గుట్టు రట్టు చేస్తున్నాయి. అమెరికా సైనిక బలగాల మోహరింపు, యుద్ధ నౌకల కదలికలు, సముద్ర మార్గాల్లో బలగాల ప్రయాణం వంటి అత్యంత రహస్య సమాచారాన్ని చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు నిరంతరం ట్రాక్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం చైనా సంస్థలు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) డేటాను ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. యుద్ధ క్షేత్రంలో అమెరికా ఎత్తుగడలను చైనా టెక్ సంస్థలు ముందుగానే పసిగట్టడం ఇప్పుడు వాషింగ్టన్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.
చైనాకు చెందిన పలు టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, సామాజిక మాధ్యమాల సమాచారం, షిప్పింగ్ లాజిస్టిక్స్ డేటాను ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నాయి. ఈ విశ్లేషణల ద్వారా అమెరికా దళాలు ఎక్కడ మోహరించాయి, తదుపరి లక్ష్యం ఏమిటి అన్నది చైనా సంస్థలు కచ్చితంగా అంచనా వేస్తున్నాయి. కేవలం నిఘా పెట్టడమే కాకుండా, ఈ సమాచారాన్ని విశ్లేషించే నిఘా టూల్స్‌ను (Surveillance Tools) ఆ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుండటం గమనార్హం. అమెరికా వ్యూహాలను బహిర్గతం చేసేలా ఈ నిఘా పరికరాలను మార్కెటింగ్ చేయడం ద్వారా అగ్రరాజ్యం రక్షణ కవచాన్ని చైనా ఛిద్రం చేస్తోంది. పెంటగాన్ వర్గాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయని, యుద్ధరంగంలో తమ బలగాల భద్రతకు ఇది పెను ముప్పుగా మారిందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా గూఢచారి విభాగాలు చేసే ఈ నిఘా పనిని, ఇప్పుడు చైనా ప్రైవేట్ సంస్థలు వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తుండటం గమనార్హం. అమెరికా సైన్యం కదలికలను ట్రాక్ చేసే ఈ టెక్నాలజీ ఇరాన్ వంటి దేశాలకు చేరితే యుద్ధ పరిణామాలు మారిపోయే ప్రమాదం ఉందని అమెరికా భయపడుతోంది. ఒకవైపు ఇరాన్‌తో భీకర పోరు సాగిస్తున్న అమెరికాకు, మరోవైపు చైనా చేస్తున్న ఈ ‘డిజిటల్ గూఢచర్యం’ పీడకలగా మారింది. సాంకేతికతను వాడుకుని అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఓపెన్ సోర్స్ డేటాను వాడుకుని చేస్తున్న ఈ నిఘాను అడ్డుకోవడం అంత సులభం కాదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి డ్రాగన్ దేశపు డేటా వార్ అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను ప్రపంచానికి చాటిచెబుతోంది.







