ఢిల్లీ,మహా.
భారతదేశ చిత్రపటాన్ని నిశితంగా గమనిస్తే, తూర్పు దిశగా సాగిపోయే భూభాగం ఒకచోట అత్యంత సన్నని దారిలా మారుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో కొండల మధ్య విస్తరించి ఉన్న ఆ ఇరుకైన భూభాగాన్నే వ్యూహాత్మక పరిభాషలో ‘సిలిగురి కారిడార్’ అని, సాధారణ భాషలో ‘చికెన్ నెక్’ అని పిలుస్తారు. కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ భూభాగం దేశ భద్రత దృష్ట్యా అత్యంత సున్నితమైనది మాత్రమే కాదు, దేశ సమగ్రతకు ప్రాణాధారం కూడా. కోడి మెడ ఏ విధంగానైతే శరీరాన్ని తలనీ అనుసంధానిస్తుందో, అదే రీతిలో ఈ చిన్న భూభాగం భారత ప్రధాన భూభాగాన్ని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతోంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మరియు డోక్లాం సమీపంలోని చైనా సరిహద్దులకు అతిదగ్గరలో ఉండటం వల్ల ఈ ప్రాంతం ఎప్పుడూ భౌగోళిక రాజకీయ ఉత్కంఠకు నిలయంగానే ఉంటుంది.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఎనిమిది రాష్ట్రాల్లోని సుమారు నాలుగున్నర కోట్ల జనాభాకు ఈ సిలిగురి కారిడార్ ఏకైక నేల మార్గం. నిత్యావసర వస్తువుల సరఫరా నుంచి రక్షణ దళాల కదలికల వరకు ప్రతిదీ ఇక్కడ నిర్మించిన రోడ్లు, రైలు మార్గాలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ కీలక మార్గానికి పొంచి ఉన్న ముప్పు తక్కువేమీ కాదు. యుద్ధ సమయాల్లో లేదా అంతర్గత అల్లర్ల సమయంలో శతృదేశాలు ఈ 22 కిలోమీటర్ల మేర దాడులు చేసి ఈ మార్గాన్ని గనుక దిగ్బంధిస్తే, మిగిలిన భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా విడదీయబడే ప్రమాదం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో వేర్పాటువాద శక్తులు సైతం ఈ ‘చికెన్ నెక్’ను కత్తిరించడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తూ, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిరాకరణ వల్ల బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులు కూడా పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదన్నది కాదనలేని వాస్తవం.
చారిత్రక కోణంలో చూస్తే, ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో అద్భుతమైన అవకాశాలు లభించినా అవి చేజారిపోయాయనే చెప్పాలి. 1947లో దేశ విభజన సమయంలో గానీ, లేదా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం సమయంలో గానీ ఈ కారిడార్ వెడల్పును పెంచే దిశగా వ్యూహాత్మక అడుగులు పడలేదు. అప్పట్లో బంగ్లాదేశ్‌తో భూ బదలాయింపు ఒప్పందం కుదుర్చుకుని, వారికి ఇతర చోట్ల భూమిని కేటాయించి ఈ కారిడార్ వెడల్పును పెంచే వెసులుబాటు ఉన్నప్పటికీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాతీయ భద్రతా కోణంలో సీరియస్ గా తీసుకోలేదు. అనాలోచిత నిర్ణయాలు, దూరదృష్టి లేని వ్యూహాల వల్ల నేటికీ ఈ సన్నని భూభాగం చైనా వంటి దేశాల కన్ను పడితే ముప్పు వాటిల్లే స్థితిలో ఉండిపోయింది.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను, చైనా దూకుడును గమనిస్తున్న మోదీ ప్రభుత్వం ఈ విషయంలో కీలకమైన, సాహసోపేతమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. కేవలం రక్షణ చర్యలకే పరిమితం కాకుండా, ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా సురక్షితం చేసేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సిలిగురి కారిడార్ చుట్టూ ఉన్న సున్నితమైన ప్రాంతాలను ఒక ప్రత్యేక అజమాయిషీలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉన్న బీహార్‌లోని పూర్నియా, అరారియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలను కలిపి ఒక ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (UT) మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా సరిహద్దు భద్రతను కేంద్రమే నేరుగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.
మరోవైపు, సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల పరంగా అద్భుతమైన ప్రాజెక్టులను ఈ 2026 బడ్జెట్‌లో ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శతృవుల బాంబు దాడులకు కూడా చెక్కుచెదరని రీతిలో, సిలిగురి కారిడార్ క్రింద 20 నుంచి 25 మీటర్ల లోతులో సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవైన అండర్‌గ్రౌండ్ రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నారు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పై మార్గాలు మూసుకుపోయినా, ఈ భూగర్భ మార్గం ద్వారా సైనిక దళాలను, యుద్ధ సామాగ్రిని నిరంతరాయంగా ఈశాన్య రాష్ట్రాలకు తరలించే వీలుంటుంది. దీనికి అదనంగా ప్రస్తుతమున్న రెండు లైన్ల రైల్వే ట్రాక్‌లను నాలుగు లైన్లకు విస్తరిస్తూ రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నారు.
ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన మరో ఘట్టం బ్రహ్మపుత్ర నది క్రింద నిర్మించనున్న భారీ సొరంగ మార్గం. గోహ్‌పూర్ మరియు నుమలిగఢ్ మధ్య సుమారు 34 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ రోడ్-కమ్-రైల్ టన్నెల్, భారతదేశ రక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 18,662 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే, ప్రపంచంలోనే ఇలాంటి టన్నెళ్లలో రెండవదిగా మరియు భారత్‌లో మొదటిదిగా రికార్డు సృష్టిస్తుంది. నదిపై ఉండే వంతెనలు లక్ష్యంగా దాడులు జరిగినా, నది అడుగున ఉండే ఈ టన్నెల్ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీకి రక్షణ కవచంలా మారుతుంది. 2026లోనే పనులు ప్రారంభించి, ఐదేళ్ల కాలపరిమితిలో దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన డీపీఆర్ , భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం కాగితాల మీద ప్రణాళికలు వేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టి చికెన్ నెక్ భద్రతను అజేయంగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ఈ కృషి ఈశాన్య భారత భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించనుంది.








