Mahaa Daily Exclusive

  సామాన్యుడికి కోర్టే చివరి ఆశ్రయం..! కొత్త హైకోర్టు న్యాయానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి.

Share

  • కొత్త హైకోర్టు న్యాయానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి
  •  రాజేంద్రనగర్‌లో జోన్‌-2 నివాస సముదాయాలకు శంకుస్థాపన.
  •  2027 డిసెంబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యం.

హైదరాబాద్, మహా.

న్యాయవ్యవస్థ అనేది సామాన్య పౌరుడికి చివరి ఆశ్రయమని, అటువంటి పవిత్రమైన న్యాయ మందిరాన్ని నిర్మించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్‌-2 (నివాస సముదాయాలు) భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ.. ఒక దేవాలయం, మసీదు లేదా చర్చిని నిర్మించడం ఎంత గొప్ప కార్యమో, అన్ని మతాల ప్రజలకు న్యాయం అందించే కోర్టు ప్రాంగణాన్ని నిర్మించడం అంతకంటే పవిత్రమైన విషయమని అభివర్ణించారు.

 

**ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం**

 

ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేసినప్పుడే సమాజం బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “రాబోయే 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాం. పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు తమ వేదనను వినిపించుకోవడానికి, న్యాయం పొందడానికి ఇది ఒక గొప్ప వేదికగా మారుతుంది. ఈ భవనం కేవలం సిమెంట్‌, ఇటుకల నిర్మాణం కాదు.. ఇది మా ప్రభుత్వం నమ్మే ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం” అని ఆయన ఉద్ఘాటించారు. న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తూ, వారికి అవసరమైన అత్యుత్తమ సౌకర్యాలను కల్పించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా తమ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

 

**2027 నాటికి నిర్మాణం పూర్తి**

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో కొత్త హైకోర్టు నిర్మాణం ఒకటని సీఎం గుర్తుచేశారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని, ఇప్పటికే జోన్‌-1లో సంస్థాగత భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. నేడు శంకుస్థాపన చేసిన జోన్‌-2 నివాస సముదాయాలను డిసెంబరు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంగణం దేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, మౌలిక వసతుల పరంగా ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 

**వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం**

 

కేవలం హైకోర్టుకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టు భవనాలు, నివాస సముదాయాల నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులకే కాకుండా, వారు వ్యక్తం చేసే పరిశీలనలు, అభిప్రాయాలకు కూడా తమ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని పునరుద్ఘాటించారు. వ్యవస్థల మధ్య విభేదాలు లేకుండా, సమన్వయంతో ప్రజా హితం కోసమే పని చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు ఇదొక సుదినమని, వచ్చే శతాబ్దం కోసం ఒక అద్భుతమైన నిర్మాణానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయ కోవిదులు పాల్గొన్నారు.

Latest