- కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలకు కోలుకోలేని దెబ్బ!
- ప్రలోభాలు, బెదిరింపులను ఛేదించి మున్సిపల్ పీఠం కైవసం.
- ఇది ప్రజాస్వామ్య విజయమన్న ఎన్.వి. సుభాష్.
హైదరాబాద్, మహా.
ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అహంకారానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు గట్టి చెక్ పెట్టారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ స్పష్టం చేశారు. ఆదివారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఖానాపూర్ విజయోత్సాహాన్ని పంచుకుంటూ, ఈ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పుకు నాంది అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, ఎంఐఎంతో చేతులు కలిపి చేసిన అపవిత్ర రాజకీయాలను పటాపంచలు చేస్తూ ఖానాపూర్ కోటపై కాషాయ జెండా రెపరెపలాడటం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు అన్ని రకాల అప్రజాస్వామిక మార్గాలను అనుసరించిందని సుభాష్ ధ్వజమెత్తారు. కౌన్సిలర్లను బెదిరించడం, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఒత్తిళ్లు తీసుకురావడం, రాజకీయ దుర్వినియోగానికి పాల్పడటం వంటి చర్యలకు పాల్పడినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారని విమర్శించారు. మొన్న నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏ విధంగా బహిర్గతమైందో, ఖానాపూర్లోనూ అదే తరహా కుమ్మక్కు రాజకీయాలను మరోసారి ప్రజలు కళ్లారా చూశారని దుయ్యబట్టారు. ఎంఐఎం అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసిన కాంగ్రెస్ కుతంత్రాలకు ఈ ఫలితం గట్టి చెంపపెట్టు అని ఆయన విమర్శించారు.
ఈ చారిత్రాత్మక విజయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనమని సుభాష్ కొనియాడారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన పడుతున్న శ్రమకు ఈ గెలుపు ఒక గుర్తింపు అని పేర్కొన్నారు. అలాగే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందించిన అద్భుత సమన్వయం, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మార్గదర్శకత్వం ఈ విజయానికి కీలక పునాదులు వేశాయని వివరించారు. స్థానిక నాయకత్వం మరియు అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు ఎన్ని ప్రలోభాలు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని ఆయన ప్రశంసించారు.
ఖానాపూర్ ఫలితం కేవలం ఒక మున్సిపాలిటీ గెలుపు మాత్రమే కాదని, ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు, వారి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొదలైన నిరసన జ్వాల అని సుభాష్ విశ్లేషించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీకి అసలైన మరియు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఎన్నిక మరోసారి సుస్పష్టం చేసిందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకమే పెట్టుబడిగా ముందుకు సాగుతున్న బీజేపీకి ఇది ఒక కీలక మైలురాయి అని, ఖానాపూర్ నుంచి ప్రారంభమైన ఈ మార్పు గాలి తెలంగాణ నలుమూలలకూ విస్తరించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికార మదంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులు ఇకనైనా వాస్తవాలను గ్రహించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని ఆయన హితవు పలికారు.








