- కార్మికుల నియామకాలపై కాదు.
- మీ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించండి.
- రౌండ్ టేబుల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టికి కల్వకుంట్ల కవిత నిప్పులు సవాల్.
హైదరాబాద్, మహా.
సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే మలిదశ తెలంగాణ ఉద్యమం తరహాలో మరో భారీ పోరాటానికి సిద్ధమవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి మరియు హెచ్ఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల వారసులకు ఇచ్చే డిపెండెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికుల కష్టార్జితంపై ఎంక్వైరీలు వేయడం మానేసి, రాజస్థాన్‌లో జరిగిన సోలార్ ఒప్పందం మరియు లిథియం రిఫైనరీ పేరుతో సాగుతున్న వేల కోట్ల కుంభకోణాలపై విచారణకు సిద్ధమా అని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.
సింగరేణి అనేది కేవలం ఒక బొగ్గు గని మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సిరులవేణి అని కవిత అభివర్ణించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో తినడానికి తిండి లేని సమయంలో సింగరేణి వేలాది కుటుంబాలకు ఆసరానిచ్చిందని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ సంస్థతో ఎలాంటి భావోద్వేగ సంబంధం లేకపోవడం వల్లే కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి, నల్లబొగ్గును తీస్తూ ఊపిరితిత్తులు పాడుచేసుకుంటున్న కార్మికుల పట్ల ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత గత ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం 20 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిందని, ఆనాటి ప్రభుత్వ విధానంపై ఇప్పుడు విచారణ జరపడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సింగరేణి కార్మికులతో పెట్టుకున్న ఏ నాయకుడూ బాగుపడలేదని, భట్టి విక్రమార్క కార్మికుల ఉసురు పోసుకోవద్దని ఆమె హెచ్చరించారు.
సంస్థలో జరుగుతున్న వాస్తవ అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. డీజిల్ కుంభకోణం వల్ల 250 కోట్లు, నిబంధనల ఉల్లంఘన వల్ల 74 కోట్లు, లీకేజీల వల్ల 24 కోట్లు ఇలా మొత్తంగా సంస్థకు జరిగిన నష్టాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ మరియు బొగ్గు బకాయిలు రూ. 47 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడం వల్ల కార్మికుల రక్షణకు, జీతాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఇదే సమయంలో అత్యంత అనుమానాస్పద రీతిలో రాజస్థాన్ సోలార్ ప్రాజెక్టు కోసం రూ. 11 వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడం, అలాగే కేవలం 27 లక్షల ఆదాయం ఉన్న అల్ట్ మిన్ అనే చిన్న సంస్థతో రూ. 2250 కోట్ల లిథియం రిఫైనరీ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలే లిథియం రిఫైనరీలో నష్టపోతుంటే, ఏమాత్రం అనుభవం లేని సంస్థకు ఈ ప్రాజెక్ట్ ఎలా కట్టబెట్టారని ఆమె నిలదీశారు.
కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కవిత పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 350 మందికి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని కోరారు. ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, రిస్క్ సెక్టార్లో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని, ఈ అంశంపై తాను 2015లోనే పార్లమెంటులో గళం ఎత్తానని గుర్తు చేశారు. హెల్త్ విషయంలో నిమ్స్ రేట్ల కంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీజీహెచ్ఎంఎస్ రేట్లను వర్తింపజేయాలని కోరారు. సింగరేణి పరిరక్షణ కోసం హెచ్ఎంఎస్ చేపట్టే ఏ పోరాటానికైనా తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల హక్కుల కోసం మరో తెలంగాణ ఉద్యమ తరహాలో వీరోచితంగా పోరాడతామని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.







