Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికుల కోసం మరో పథకం..

Share

  • సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా
  • యూనియన్ బ్యాంకు చొరవతో బీమా

హైదరాబాద్, మహా : సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధుల్లో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిన సంస్థ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సహజ మరణం పొందిన కార్మికులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఏప్రిల్ 1 నుంచే పథకం ప్రారంభం కాగా.. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు, అధికారికి సహజ మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, పర్సనల్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పోట్రుల ప్రత్యేక చొరవ ఉంది. గతంలో కేవలం ప్రమాదాలకే పరిమితమైన బీమా సౌకర్యాన్ని, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో మరణించే కార్మికులకు కూడా వర్తింపజేయాలని యాజమాన్యం బ్యాంకును కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన యూనియన్ బ్యాంక్.. తమ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగికి ఈ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది.

 

సాధారణంగా ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 లక్షల జీవిత బీమా తీసుకోవాలంటే వయసును బట్టి ఏటా కనీసం 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, సింగరేణి యాజమాన్యం కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం కార్మికులు ఒక్క పైసా కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం యూనియన్ బ్యాంకులో జీతం ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మొత్తం ప్రీమియం భారాన్ని బ్యాంకే భరిస్తుంది. ఇది కార్మికులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా వారి కుటుంబాలకు పెద్ద మొత్తంలో రక్షణ కల్పిస్తుంది. సింగరేణిలో ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి మరికొన్ని బ్యాంకులు కూడా రూ.1 కోటి ప్రమాద బీమాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ సహజ మరణానికి కూడా బీమాను ప్రకటించడంతో.. మిగిలిన బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచేలా యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే అన్ని బ్యాంకు ఖాతాదారులైన కార్మికులకు ఈ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest