హైదరాబాద్, మహా : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా ప్రస్తావించిన ఆమె, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర అపారమైందని పేర్కొన్నారు. వారి త్యాగాలు, పోరాటాలు, సమర్పణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉద్యమకారులకు కేవలం గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్సీ విజయశాంతిని ఆదివారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో తమ సమస్యలను సానుభూతితో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యమకారులతో ఆప్యాయంగా ముచ్చటించిన విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, ఉద్యమకారుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దశలవారీగా ఉద్యమ సైనికుల కోసం ప్రకటించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవనం, వారి కుటుంబాల భద్రత కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె వ్యక్తం చేసిన ఆప్యాయతకు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.







