- ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ది ‘పేర్లు మార్చే స్టార్టప్’.
- కేంద్రం నిధులతో పనులు.. కేరళ సర్కారు భారీ పోస్టర్ల ప్రచారం.
- యువత గల్ఫ్ దేశాలకు వలస పోవాల్సిందేనా? ఉపాధి కల్పనే మా లక్ష్యం.
- కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా.
కొచ్చి/తిరువనంతపురం, మహా .
కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్పు కోసమే కాదని, రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్నవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఆదివారం ఎర్నాకుళం జిల్లా కున్నతునాడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై నిప్పులు చెరిగారు. దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళలో యువతకు ఉద్యోగాలు లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలివైన కేరళ యువతకు సొంత రాష్ట్రంలోనే గొప్ప అవకాశాలు కల్పించి, ‘శ్రేష్ఠ కేరళ’ను నిర్మించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం, దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నాయని, కేరళలో కూడా మార్పునకు సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీరును విమర్శిస్తూ.. ఆయన రాష్ట్రంలో ఒక కొత్త ‘స్టార్టప్’ను ప్రారంభించారని, అది ‘పేర్లు మార్చే స్టార్టప్’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పేర్లు మార్చి తన ఖాతాలో వేసుకోవడమే విజయన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జాతీయ రహదారి 66 నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే 100 శాతం భరిస్తుంటే, అక్కడ మాత్రం ముఖ్యమంత్రి భారీ పోస్టర్లు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. పేదలకు ప్రధాని మోదీ 5 కిలోల బియ్యం అందజేస్తున్నారని, జాతీయ ఆరోగ్య మిషన్ కోసం రూ. 600 కోట్లు పంపినా తన ఫొటో పెట్టుకోవడానికి స్థలం లేదన్న కారణంతో విజయన్ ఆ పథకాన్ని మూసివేశారని దుయ్యబట్టారు. ఇక పెట్రోల్ ధరల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన చెప్పిన ధరలు కేరళలో కాదని, పాకిస్థాన్‌లో పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
తిరువనంతపురం సభలోనూ అమిత్ షా తనదైన శైలిలో గర్జించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు కేరళకు అవినీతిని తప్ప మరేమీ మిగల్చలేదని మండిపడ్డారు. శబరిమల ఆలయ బంగారు కేసును ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారిని జైలుకు పంపుతామని హామీ ఇచ్చారు. రాజకీయం తమకు అధికారం కోసం కాదని, భారత్ మాతను ప్రపంచ అత్యున్నత పీఠంపై నిలబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన భావోద్వేగంతో ప్రకటించారు. 2014 నుంచి కేరళలో ఎన్డీఏ ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందని, ఈసారి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.







