Mahaa Daily Exclusive

  హుర్ముజ్‌లో భారత్ ముద్ర..! యుద్ధ మేఘాల మధ్య దౌత్య విజయం.. బాబ్ ఎల్ మాండేబ్‌పై టెన్షన్.

Share

  • సురక్షితంగా ‘గ్రీన్ ఆశా’!
  •  ఎల్‌పీజీ ట్యాంకర్‌తో సురక్షితంగా జలసంధిని దాటిన భారత నౌక.
  •  ఇరాన్ ఆంక్షల నడుమ 9వ భారత నౌకగా రికార్డు.. స్వదేశానికి పయనం.
  •  యుద్ధ మేఘాల మధ్య దౌత్య విజయం.. బాబ్ ఎల్ మాండేబ్‌పై టెన్షన్.

 

ఢిల్లీ, మహా.

 

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఉక్కుపిడికిలి బిగించినా.. భారత నౌకల ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారత సరకు రవాణా నౌక ‘గ్రీన్ ఆశా’ ఆదివారం సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. సుమారు 20,000 టన్నుల ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లోడుతో ఉన్న ఈ నౌక ప్రస్తుతం భారత తీరం వైపు పయనమైంది. గల్ఫ్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్‌ను విజయవంతంగా దాటిన తొమ్మిదవ భారత నౌకగా ‘గ్రీన్ ఆశా’ నిలిచింది. ఇరాన్ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, భారత నౌకలు సురక్షితంగా బయటపడటం దేశ ఇంధన భద్రతకు ఊరటనిచ్చే అంశం.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హోర్ముజ్ జలసంధిపై టెహ్రాన్ తీవ్ర ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యూహాత్మక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించినప్పటికీ, భారత ప్రభుత్వం చేపట్టిన దౌత్యపరమైన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. భారత నౌకలకు ఎటువంటి హాని తలపెట్టవద్దని, సురక్షిత మార్గాన్ని కల్పించాలని కేంద్రం ఇరాన్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరాన్, తమకు శత్రుత్వం లేని దేశాల నౌకలను అనుమతిస్తామని ఇప్పటికే అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ కు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రయాణంలో భారత నౌకలు ప్రత్యేక ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నాయి. తమ నౌకలోని సిబ్బంది భారతీయులేనని, నౌకపై త్రివర్ణ పతాకాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తూ, ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా (లారక్, కేశ్మ్ దీవుల మధ్య నుంచి) ఈ నౌకలు ప్రయాణిస్తున్నాయి.

గల్ఫ్‌లో పరిస్థితి రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. హోర్ముజ్‌తో పాటు ప్రపంచ సరకు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్ మాండేబ్‌ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తాజా సంకేతాలివ్వడం ప్రపంచ వాణిజ్య వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించడం, మంగళవారం నుంచి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించడం యుద్ధ భయాన్ని పతాక స్థాయికి చేర్చింది. ఈ పరిణామాల మధ్య భారత్ తన పౌరుల, నౌకల భద్రత కోసం హై అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం ‘గ్రీన్ ఆశా’ సురక్షితంగా ఒమన్ తీరానికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న మిగిలిన భారత నౌకలను కూడా ఇదే తరహాలో స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Latest