Mahaa Daily Exclusive

  లిక్కర్ ‘సిండికేట్ గణేష్’పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!*వైన్ షాపుల పేరుతో గిరిజన ఉద్యోగికి రూ. 75 లక్షల కుచ్చుటోపీ..

Share

  •  డబ్బులు అడిగితే కులం పేరుతో దూషణ.. ఇల్లెందు పోలీసుల పంజా

హైదరాబాద్, మహా.

ఇల్లెందు పట్టణంలో ‘సిండికేట్ గణేష్’గా ప్రాచుర్యం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. వైన్ షాపుల్లో పెట్టుబడి పేరుతో ఓ గిరిజన రిటైర్డ్ ఉద్యోగిని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి, తిరిగి అడిగినందుకు కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బాణోత్ గోపీచంద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై బీఎన్ఎస్ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

బాధితుడు గోపీచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపుల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని గణేష్ ఆయనకు ఆశ చూపాడు. గణేష్ మాటలను నమ్మిన గోపీచంద్, తాను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక బ్యాంకులో దాచుకున్న రూ. 64.44 లక్షల మొత్తాన్ని అతడికి అందజేశాడు. అంతటితో ఆగకుండా, మరో మద్యం దుకాణం కొనుగోలు చేస్తున్నానని నమ్మబలికి మరో రూ. 11.50 లక్షలను కూడా గణేష్ వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ. 75 లక్షలకు పైగా నగదు తీసుకున్న తర్వాత లాభాల మాట దేవుడెరుగు, అసలు ఇవ్వడానికి కూడా గణేష్ మొండికేయడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి 12వ తేదీన ఇల్లెందులోని గోవింద్ సెంటర్ సమీపంలో గణేష్ ఎదురవగా, తన బాకీ డబ్బుల గురించి గోపీచంద్ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన గణేష్, తన ఇద్దరు అనుచరుల ముందే గోపీచంద్‌పై అసభ్య పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా, కులం పేరుతో దూషించి అవమానపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు గణేష్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 296(బి), 318(4)తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో ఉన్న ‘సిండికేట్ గణేష్’పై ఇప్పుడు అట్రాసిటీ కేసు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Latest