Mahaa Daily Exclusive

  గచ్చిబౌలికి ఒలింపిక్ కళ.. చైనాను మించేలా క్రీడా నగరిగా భాగ్యనగరం..! జూన్ 2న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన..

Share

  •  జూన్ 2న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన.
  •  ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా స్టేడియానికే హెలికాప్టర్!
  •  ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయెంకాతో ‘స్పోర్ట్స్ హబ్’ హైలెవల్ భేటీ.. బోర్డుకు పూర్తి స్వేచ్ఛ.

 

హైదరాబాద్, మహా.

“భారత క్రీడా చిత్రపటంలో హైదరాబాద్ ఒక రోల్ మోడల్‌గా నిలవాలి.. గచ్చిబౌలి స్టేడియం పేరు వింటే ప్రపంచం మనవైపు చూడాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లీలా హోటల్‌లో నిర్వహించిన ‘స్పోర్ట్స్ హబ్’ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొని, తెలంగాణ క్రీడా భవిష్యత్తుపై అద్భుతమైన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో బోర్డు సభ్యులుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొణిదెల ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, సి. శశిధర్, ప్రభుత్వ ఉన్నతాధికారి జయేష్ రంజన్ మరియు స్పోర్ట్స్ ఎండి సోనీ బాలా దేవి పాల్గొన్నారు. క్రీడలను కేవలం వినోదంగానే కాకుండా, రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి తన బృహత్తర ప్రణాళికను బోర్డు ముందుంచారు.

గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు వచ్చే జూన్ 2వ తేదీన శంకుస్థాపన చేస్తామని, ఈలోగానే పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్టేడియం ఆవరణలో హెలిప్యాడ్ సహా అన్ని ప్రపంచస్థాయి వసతులు కల్పించాలని, అంతర్జాతీయ క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా స్టేడియానికి చేరుకునేలా అద్భుతమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. భవిష్యత్తులో గచ్చిబౌలి స్టేడియం ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేలా పటిష్టమైన రెవెన్యూ మోడల్‌ను రూపొందించాలని బోర్డుకు సూచించారు. ఇందుకోసం ఇప్పటికే నిపుణులైన ఆర్కిటెక్టులను నియమించామని, అభివృద్ధి పనులపై బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

తెలంగాణలో దీర్ఘకాలిక క్రీడాభివృద్ధే మా లక్ష్యమని, రేపు ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాల్సి వచ్చినా హైదరాబాద్ సిద్ధంగా ఉండేలా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా క్రీడా సౌకర్యాల కల్పనలో చైనా వంటి దేశాలను మించి అడుగులు వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో లక్షలాదిగా ఉన్న ఐటీ మరియు ఇతర రంగాల ఉద్యోగులను స్టేడియం వైపు రప్పించేందుకు భారీ స్క్రీన్లు (Big Screens) ఏర్పాటు చేయాలని, క్రీడా పోటీలు ఒక పండుగలా జరిగేలా వాతావరణాన్ని మార్చాలని సూచించారు. క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తూనే, సామాన్యులను ఆకట్టుకునేలా స్టేడియం ఉండాలని పేర్కొన్నారు. హేమాహేమీలైన బోర్డు సభ్యుల సలహాలతో తెలంగాణ క్రీడారంగం అగ్రపథాన నిలుస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Latest