* 3 వేల కోట్ల విలువైన 200 ఎకరాల రైతు భూమిపై కాంగ్రెస్ కన్ను.
* టీజీఐఐసీకి అప్పగించి అనుయాయులకు కట్టబెట్టే కుట్ర!
* నిధులు, భూమి, డీపీఆర్ సిద్ధంగా ఉన్నా పనులెందుకు ఆపారు?
* ‘దిల్’ భూముల పేరుతో రైతులను మోసం చేస్తారా?
* రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవాల్సిన కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడిందని, సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేలా రహస్య కుట్రలు సాగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ పరిరక్షణ కోసమే తాను ఇక్కడికి వచ్చానని, ఇది రాజకీయ సమస్య కాదని, లక్షలాది మంది రైతుల బతుకుదెరువుకు సంబంధించిన అత్యంత కీలకమైన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వమైనా రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప నలుగురు ఐదుగురు దళారుల కోసం కాదని హరీశ్ రావు హితవు పలికారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో పెరుగుతున్న రద్దీని, భయంకరమైన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల కోసం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ 200 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పోరాడటం వల్లే, పది కోట్ల రూపాయలను రైతులకు భూసేకరణ పరిహారంగా ఇప్పించగలిగామని వివరించారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ కట్టాలని సంకల్పించామని, అందులో భాగంగానే 2020 సంవత్సరంలో జీవో 11 ద్వారా ఈ మార్కెట్ స్థలాన్ని నోటిఫై చేశామని హరీశ్ రావు వెల్లడించారు. జీవో 216 ప్రకారం మార్కెట్ నిర్మాణం కోసం 350 కోట్ల రూపాయల నిధులను బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా ఉంచామని, ఎలా కట్టాలనే ప్లాన్‌తో పాటు వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ కూడా తయారు చేశామని పేర్కొన్నారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా రావాలని కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసిందని వివరించారు. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ముందుకు తీసుకెళ్లకపోవడమే కాకుండా, మార్కెట్ భూములను టీజీఐఐసీ (TGIIC)కి అప్పగించి అమ్మేయాలని చూడటం వెనుక భారీ కమీషన్ల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఎక్కడ విలువైన భూములు కనిపిస్తే అక్కడ వాటిని అమ్మేయడమే ఏకైక పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రోజుకు 25 నుంచి 30 వేల మంది రైతులకు ఉపయోగపడే భవిష్యత్తు ముఖ్యమా లేక నలుగురు వ్యాపారులు, దళారులు ముఖ్యమా అని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి నువ్వు రైతుల పక్షాన ఉంటావా లేక దళారుల పక్షాన ఉంటావా అని ప్రశ్నిస్తూ, నీ కమీషన్ల కోసం రైతుల భూములను కూడా వదిలిపెట్టవా అని ఘాటుగా విమర్శించారు. కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చివరకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని ఈ భూములపై కన్నేయడం దారుణమని ధ్వజమెత్తారు.
కోహెడ భూములకు ప్రత్యామ్నాయంగా ‘దిల్’ భూముల్లో మార్కెట్ కట్టిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని హరీశ్ రావు కొట్టిపారేశారు. సదరు ‘దిల్’ భూముల జోలికి వెళ్లవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఆ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉందని, అక్కడ ఎస్సీ రైతులు సాగు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. కోర్టు వివాదాల్లో ఉండి, స్టేలు ఉన్న భూములను రైతులకు ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఏ రైతు నమ్ముతాడని ప్రశ్నించారు. ఈ మార్కెట్ నిర్మాణాన్ని ఆపేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, కానీ అంతర్జాతీయ స్థాయి మార్కెట్ వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూముల్లో రైతుల భూములు చేర్చి వారిని వేధించవద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగా రైతు కాబట్టి, ప్రభుత్వంతోనైనా కొట్లాడి కోహెడలోనే మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాలని కోరారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే రైతుల పక్షాన ఎంత దూరమైనా పోరాడుతామని, ప్రభుత్వం మెడలు వంచైనా కోహెడలోనే మార్కెట్ నిర్మించేలా చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి మరియు ఇతర నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు.








