Mahaa Daily Exclusive

  బాసర క్షేత్రానికి మహర్దశ: ₹225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

Share

చదువుల తల్లి బాసర క్షేత్రానికి మహర్దశ.
* రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ.
* తిరుమల తరహాలో ఆధ్యాత్మిక శోభ.
* మనవడు రియాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించిన ముఖ్యమంత్రి దంపతులు.
* నిర్మల్ జిల్లాలో ప్రగతి వెల్లువ.. గోదావరి పుష్కరాల నాటికి అభ్యున్నతే లక్ష్యం.
నిర్మల్/బాసర, మహా .

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన జ్ఞాన సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఇకపై సరికొత్త ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లబోతోందనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం బాసరలో పర్యటించి, ఆలయ పునరుద్ధరణ , విస్తరణ పనులకు ఘనంగా భూమిపూజ నిర్వహించారు. సుమారు 225 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తూ, బాసరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ ప్రభుత్వ సంకల్పమని చాటిచెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తమ మనవడు రియాన్ష్ అలియాస్ రుద్ర దేవ్‌కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ పలక బలపంతో చిన్నారికి అక్షర విన్యాసం చేయించగా, వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి కుమార్తె నైమిశా రెడ్డి దంపతులతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
బాసర ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అత్యంత ఆధునికంగా, అదే సమయంలో సంప్రదాయబద్ధంగా ఉండబోతోంది. ప్రస్తుతం కేవలం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని ఏకంగా 60 వేల చదరపు అడుగుల మేర విస్తరించనున్నారు. అంటే ఇప్పుడున్న వైశాల్యం కంటే మూడు రెట్లు పెద్దదిగా చదువుల తల్లి సన్నిధి రూపుదిద్దుకోనుంది. కొత్తగా ఆలయ శిఖరాలు, భక్తుల కోసం విశాలమైన మండపాలు, తిరుమల తరహాలో మాడవీధులు మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఈ నిధులతో చేపట్టనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా పారతో తవ్వి పనులను ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి పనుల తొలి దశను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బాసర క్షేత్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతూనే, ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక విలువలు కాపాడేలా నిర్మాణాలు ఉండాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బాసరలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పునర్నిర్మాణ నమూనాలను ఆయన ఆసక్తిగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జ్ఞాన సరస్వతి అమ్మవారు ముఖ్యమంత్రిని తన కుమారుడి రూపంలో ఆశీర్వదించిందని, అందుకే ఈ ప్రతిష్ఠాత్మక ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వేదం భోజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు. బాసర పర్యటన ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి చేరుకుని అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ వర్గాలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరించారు. బాసరలో ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కేవలం ఒక ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం జిల్లా ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఉండబోతున్నాయని చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగానే బాసర వంటి పుణ్యక్షేత్రం నుంచి విద్యా వ్యాప్తికి కొత్త జవజీవాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ విస్తరణతో పాటు భక్తులకు అవసరమైన తాగునీరు, రవాణా, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరుస్తామని వివరించారు. గోదావరి నది తీరాన్ని సుందరీకరించి భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.