విజిలెన్స్ అధికారులమంటూ వెబ్ రిపోర్టర్ల వసూళ్లు.
* గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన ముగ్గురు అరెస్ట్.
* బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నావంటూ బ్లాక్ మెయిల్.
* 2 లక్షలు డిమాండ్ చేసిన కేటుగాళ్లు.
* సిసిటివి కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకున్న ఫిలిం నగర్ పోలీసులు.
* పరారీలో మరో నిందితుడు.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో నకిలీ అధికారుల అవతారమెత్తి సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న ముఠాల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ పరిధిలో విజిలెన్స్ అధికారులమంటూ చలామణి అవుతూ ఒక గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు వెబ్ ఛానల్ రిపోర్టర్లు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం, ఫిలిం నగర్ ఎంఆర్సీ కామన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న ఒక డెలివరీ బాయ్‌ను ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. తాము విజిలెన్స్ అధికారులమని పరిచయం చేసుకున్న వారు, సదరు డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడని నిందలు మోపారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి నీ ఉద్యోగం తీయించేస్తామని, కేసు పెట్టి జైలుకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
**బెదిరింపులకు గురైన డెలివరీ బాయ్**
భయపడుతుండటాన్ని గమనించిన నిందితులు, కేసు నుంచి తప్పించుకోవాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం తన వద్ద లేదని బాధితుడు మొరపెట్టుకున్నప్పటికీ వారు వినలేదు. చివరకు ఆ రోజు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా వసూలు చేసిన నగదునంతా బలవంతంగా లాక్కుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన డెలివరీ బాయ్ వెంటనే తన యజమానికి విషయం తెలియజేశాడు. బాధితుడి యజమాని ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సిసిటివి ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు, నిందితులు ప్రయాణించిన వాహనం ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏ1గా ఉన్న మొహమ్మద్ మన్సూర్ హసన్ (60) బండ్లగూడ సన్‌సిటీ నివాసి అని, అతను ‘న్యూస్ 9’ అనే వెబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఏ2గా ఉన్న మొహమ్మద్ తౌఫీక్ (46) ముషీరాబాద్ నివాసి కాగా, అతను ‘బిటిఎస్ న్యూస్’ వెబ్ ఛానల్ రిపోర్టర్‌గా చలామణి అవుతున్నాడు. వీరికి సహకరించిన ఏ3 మొహమ్మద్ తాజ్ (29) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి నుంచి పోలీసులు ప్రస్తుతానికి 23 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మిగిలిన నగదు పరారీలో ఉన్న మరో నిందితుడి వద్ద ఉందని వారు వెల్లడించారు. పరారీలో ఉన్న నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సామాన్యులను భయపెట్టి వసూళ్లకు పాల్పడే ఇటువంటి నకిలీ రిపోర్టర్లు మరియు అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఫిలిం నగర్ పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








