- కోల్‌కతా హైకోర్టులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు.
- కేంద్ర బలగాల ఉపసంహరణకు ససేమిరా!
ఢిల్లీ, మహా.
పశ్చిమ బంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓటర్ల క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్ల కోసం ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కోరింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, సమర్థవంతమైన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సాధించిన పురోగతిని, క్షేత్రస్థాయిలో నెలకొన్న భద్రతా పరిస్థితులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా సమీక్షించింది.
ఈ విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ (ఈసీ) కోర్టుకు కీలక వివరాలను సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో తొలగింపులపై సుమారు 60 లక్షల అభ్యంతరాలు వచ్చాయని, వీటిని అత్యంత వేగంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. జ్యుడీషియల్ అధికారులు ఇప్పటికే 59 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించారని, మిగిలిన క్లెయిమ్‌ల ప్రక్రియను ఈ రోజులోగా పూర్తి చేసి రాత్రికి తుది వివరాలను ప్రచురిస్తామని స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన నివేదిక ఆధారంగా ఈ పురోగతి పట్ల సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా మాల్దా వంటి సున్నితమైన జిల్లాల్లో అధికారులను ఘెరావ్ చేసినప్పటికీ, వెనక్కి తగ్గకుండా సుమారు 8 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించిన తీరును ధర్మాసనం ప్రస్తావించింది.
ఇదే సమయంలో న్యాయాధికారులకు ఎదురవుతున్న బెదిరింపులు, భద్రతా అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. విధి నిర్వహణలో ఉన్న న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైతే, తాము మౌనంగా ఉండబోమని, తదుపరి చర్యలు ఏంటో తమకు తెలుసని ధర్మాసనం హెచ్చరించింది. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను, ప్రస్తుత ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని, బంగాల్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాల ఉనికి అత్యవసరమని అభిప్రాయపడింది.
మరోవైపు, ఓటర్ల తొలగింపులపై అప్పీళ్లను విచారించేందుకు కేటాయించిన 19 ట్రిబ్యునళ్లు ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ, ట్రిబ్యునళ్లు గరిష్ఠ స్థాయిలో పనిచేసేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అప్పీళ్ల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకే హైకోర్టు స్థాయిలో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ రూపొందించే విధివిధానాల ద్వారా క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతుందని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది.








