ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత విపణిపై ఎటువంటి ప్రభావం చూపడం లేదని, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, దేశీయంగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరల్లో అసాధారణ హెచ్చుతగ్గులేవీ చోటుచేసుకోలేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా వివరాలు వెల్లడిస్తూ.. దేశవ్యాప్తంగా ఆహార భద్రత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న 528 ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 40 రకాల నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. హోల్‌సేల్, రిటైల్ ధరల కదలికలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో అప్డేట్ చేస్తూ, ఎక్కడైనా ధరలు పెరిగే అవకాశం ఉంటే తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాలకు, అలాగే ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కోవడానికి తగినంత స్థాయిలో గోధుమలు, బియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు జరిగే బ్లాక్ మార్కెటింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పప్పుధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది ఆశాజనకంగా ఉందని, గతేడాదితో పోలిస్తే దిగుబడి పెరిగిందని మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల పప్పుధాన్యాల బఫర్ స్టాక్ అందుబాటులో ఉండటం సానుకూల అంశమని చెప్పారు. సామాన్యుడి వంటింట్లో కీలకమైన ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటాల ఉత్పత్తి సైతం గతేడాది స్థాయిలోనే కొనసాగుతోందని, సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిణామాలు భారత్ వంటి పెద్ద మార్కెట్‌పై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరలను నియంత్రణలో ఉంచుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








