Mahaa Daily Exclusive

  సాత్తాంకుళం మృత్యుకాండ.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష..

Share

  • 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.
  •  చారిత్రాత్మక తీర్పు వెలువరించిన మదురై కోర్టు!

మదురై, మహా.

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో న్యాయదేవత కళ్లు తెరిచింది. రక్షక భటుల ముసుగులో అమానుషానికి ఒడిగట్టి, ఇద్దరు సామాన్య వ్యాపారుల ప్రాణాలు బలితీసుకున్న తొమ్మిది మంది పోలీసులకు మదురైలోని మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2020లో జరిగిన ఈ దారుణ ఘటనపై సుదీర్ఘ కాలం పాటు సాగిన న్యాయపోరాటం నేటితో ఒక కొలిక్కి వచ్చింది. నిందితులు చేసిన నేరం ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైనది’గా పరిగణించిన న్యాయస్థానం, సమాజానికి బలమైన సంకేతం పంపేలా ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2020 జూన్ నెలలో కరోనా లాక్‌డౌన్ నిబంధనల అమలు పేరుతో సాత్తాంకుళం పోలీసులు సాగించిన మృత్యువేట అరణ్యకాండను తలపించింది. జూన్ 19న రాత్రి వేళ తన మొబైల్ దుకాణాన్ని కాస్త ఆలస్యంగా మూశారన్న సాకుతో పోలీసులు పి. జయరాజ్ (58)ను అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి అరెస్టు గురించి విచారించడానికి వెళ్లిన కుమారుడు జె. బెనిక్స్ (31)ను కూడా పోలీసులు స్టేషన్‌లోనే బంధించారు. “పోలీసులతో ఎలా ప్రవర్తించాలో గుణపాఠం నేర్పుతామంటూ” ఆ రాత్రంతా తండ్రీకొడుకులను అడవి మృగాల కంటే హీనంగా చిత్రహింసలకు గురిచేశారు. వారి దేహాల నుంచి కారిన రక్తాన్ని వారితోనే తుడిపించడమే కాకుండా, మరుసటి రోజు సాక్ష్యాలను నాశనం చేయడానికి పారిశుధ్య కార్మికులతో స్టేషన్‌ను కడిగించిన తీరు పోలీసుల క్రూరత్వానికి అద్దం పట్టిందని సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఆ దెబ్బలకు తాళలేక తండ్రీకొడుకులు జైలులోనే ప్రాణాలు విడిచారు.

ఈ అమానుష ఘటనపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా స్పందించి విచారణను సీబీఐకి అప్పగించింది. సీబీఐ పక్కా ఆధారాలతో అప్పటి సాత్తాంకుళం ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ సహా పది మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కోవిడ్-19 సోకి మరణించగా, మిగిలిన తొమ్మిది మందిపై విచారణ కొనసాగింది. విచారణలో ఆ తండ్రీకొడుకులు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, కేవలం పోలీసుల అహంకారం, నేరపూరిత కుట్ర కారణంగానే వారు మరణించారని స్పష్టమైంది. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం, వైద్య నివేదికలు పోలీసుల నేరాన్ని రూఢీ చేశాయి.

గత నెల మార్చి 23న ఈ తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు, సోమవారం శిక్షా కాలాన్ని ప్రకటిస్తూ అందరికీ మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. శిక్ష వినే సమయంలో నిందితులు కనీస పశ్చాత్తాపం చూపలేదని, విధి నిర్వహణలో ఉన్న అధికారులే హంతకులుగా మారడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరణశిక్షకు గురైన వారిలో అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు పి. రఘు గణేష్, కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్, ఎ. సామిదురై, కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజ్, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్, మరియు ఎస్. వేలుముత్తు ఉన్నారు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన జయరాజ్, బెనిక్స్ కుటుంబానికి ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని, ఈ తీర్పు బాధితుల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.