Mahaa Daily Exclusive

  రాష్ట్రవ్యాప్తంగా వరుణుడి విలయం.. రెండ్రోజుల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది బలి..!

Share

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం పెను విషాదాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండగా.. ఆకాశం నుంచి పడుతున్న పిడుగులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. గడిచిన 48 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందగా, ఆదివారం ముగ్గురు మృత్యువాత పడ్డారు. అప్పటివరకు కళ్లముందే ఉన్నవారు పిడుగుపాటుకు నిశ్చేతనంగా పడి ఉండటం చూసి ఆయా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

సోమవారం మధ్యాహ్నం ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పెను నష్టం సంభవించింది. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో పొలం పనుల్లో ఉన్న రావులపల్లి శివరామకృష్ణపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మార్కాపురం జిల్లా పరిధిలోని పుల్లలచెరువు వద్ద గల ఒక మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగు విరుచుకుపడటంతో కన్నయ్య అనే యువకుడు దుర్మరణం చెందగా, మరో నలుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే మండలం యండ్రపల్లిలో పిడుగుపాటుకు నాగయ్య అనే రైతు ప్రాణాలు విడిచారు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ సమీపంలో పనుల నిమిత్తం వచ్చిన దుర్గేశ్ అనే వ్యక్తి కూడా ఈ ప్రకృతి విపత్తుకు బలైపోయారు.

ఉత్తరాంధ్రలోనూ పిడుగుల ధాటికి ప్రాణనష్టం సంభవించింది. విజయనగరం జిల్లా వంగరలో పొలంలో మొక్కజొన్న కంకులు ఏరుతున్న సమయంలో ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతుపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. అంతకుముందు ఆదివారం కూడా రాష్ట్రంలో ముగ్గురు పిడుగులకు బలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బి.కేసుపురంలో పొలం పనులకు వెళ్లిన తల్లి కృష్ణవేణి (35), కుమార్తె యోగేశ్వరి (15) ఒకేసారి పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికులను కలచివేసింది. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కలవగుంటలో తాటి చెట్టు ఎక్కుతున్న గీత కార్మికుడు వి.కామరాజ్ (35)పై పిడుగు పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

రెండు రోజుల్లోనే ఇంతటి భారీ ప్రాణనష్టం జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకాల మరణం చెందిన వారి కుటుంబాలు వీధిన పడ్డాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వేడుకుంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రైతులు, గొర్రెల కాపరులు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషాద ఘటనలపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.