హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో మృగాల సంచారం ఆగడం లేదు. అభంశుభం తెలియని పసిహృదయాలపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. గోల్కొండ ప్రాంతంలో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన నగరవాసులను తీవ్రంగా కలచివేసింది. అయితే, ఒక సామాన్య యువకుడు ప్రదర్శించిన అప్రమత్తత, ధైర్యసాహసాల వల్ల ఆ చిన్నారి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ పరిధిలో నివసించే ఎనిమిదేళ్ల బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఒక ఆటో ఎక్కింది.
నిర్దేశించిన మార్గంలో కాకుండా, ఆటో డ్రైవర్ సలీం బాలికకు మాయమాటలు చెప్పి దారి మళ్లించాడు. ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో భయాందోళనకు గురైన చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మహ్మద్ ఫిరోజ్ అనే స్థానిక యువకుడు చిన్నారి ఆర్తనాదాలను విని అప్రమత్తమయ్యాడు. ఏదో అనర్థం జరుగుతోందని గ్రహించిన ఫిరోజ్, ఏమాత్రం సంకోచించకుండా ఆటో వద్దకు పరిగెత్తుకెళ్లాడు. యువకుడిని చూడగానే భయపడిన నిందితుడు సలీం, బాలికను అక్కడే వదిలేసి ఆటోతో సహా పరారయ్యాడు.
అనంతరం ఫిరోజ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. భయంతో వణికిపోతున్న చిన్నారిని ఓదార్చి, ఆమె మెడలో ఉన్న స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ వేగంగా స్పందించి గాలింపు చేపట్టి, నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆటోను కూడా సీజ్ చేశారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక చిన్నారి జీవితాన్ని కాపాడిన మహ్మద్ ఫిరోజ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. తన కార్యాలయానికి పిలిపించుకుని ఆయనను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సమాజంలో ఇలాంటి స్పందనలు పెరిగినప్పుడే నేరాలను అదుపు చేయగలమని సీపీ వ్యాఖ్యానించారు. అలాగే నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన కానిస్టేబుళ్లను కూడా ఆయన ప్రశంసించారు. అభంశుభం తెలియని చిన్నారిని కాపాడిన ఫిరోజ్‌పై ప్రస్తుతం నగరవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది







