Mahaa Daily Exclusive

  జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లోనే కొత్త అక్రిడిటేషన్ కార్డులు..!

Share

హైదరాబాద్, మహా.

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తల పట్ల జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, దరఖాస్తుల పరిశీలన మరియు కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు అందిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు ప్రియాంక తెలిపారు. ఈ సమావేశంలో అర్హత పొందిన జర్నలిస్టులందరికీ ఏప్రిల్ నెలలోనే కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు. అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శకగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

జిల్లా స్థాయి జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందని ప్రత్యేక కమిషనర్ తెలిపారు. జిల్లాల్లో కూడా ఈ నెలలోనే అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలను నిర్వహించి, అర్హులైన జర్నలిస్టులకు కార్డులు అందజేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కాబట్టి, జిల్లా స్థాయి జర్నలిస్టులు తమ దరఖాస్తులను వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె కోరారు. సమాచార శాఖ ద్వారా జర్నలిస్టులకు అందాల్సిన గుర్తింపు కార్డుల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.