Mahaa Daily Exclusive

  జీయాగూడలో హైడ్రామా..! జీహెచ్‌ఎంసీ సీళ్లు పగులగొట్టిన ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్..!

Share

  •  అధికారుల సీల్.. ప్రజాప్రతినిధి రీ-ఓపెన్.. భాగ్యనగరంలో ‘కబేళా’ రాజకీయం!
  • పొట్టకూటి కోసం పట్టుబట్టిన కార్మికులు: నిబంధనల ఉల్లంఘనపై అధికారుల సీరియస్!

 

హైదరాబాద్, మహా.

భాగ్యనగరంలోని జీయాగూడ ప్రాంతం మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన పేరుతో అధికారులు వేసిన సీళ్లను ఏకంగా ఓ ఎమ్మెల్యే పగులగొట్టి కబేళాను రీ-ఓపెన్ చేయడం సంచలనం సృష్టించింది. కారువాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ చర్యకు పాల్పడటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మరియు పోలీసు వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజాప్రతినిధికి, అధికారులకు మధ్య జరిగిన ఈ ‘సీల్’ వార్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

**అసలేం జరిగింది?**

జీయాగూడ మీకల్ మండిలో ఉన్న కబేళా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందంటూ ఈ నెల 2వ తేదీన జీహెచ్‌ఎంసీ అధికారులు దానికి సీల్ వేశారు. అయితే, ఈ నిర్ణయం వల్ల అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా మూసివేస్తారని కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి సైతం రంగంలోకి దిగి, ఆదివారం లోపు కబేళాను తెరవకపోతే జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందే మేకలను కోస్తామని హెచ్చరించారు.

**ఎమ్మెల్యే ఎంట్రీ.. సీళ్ల బద్ధలు:**

ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తన అనుచరులతో కలిసి జీయాగూడ చేరుకున్నారు. అధికారుల నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తానే స్వయంగా జీహెచ్‌ఎంసీ వేసిన సీళ్లను పగులగొట్టారు. అనంతరం కబేళా లోపలికి ప్రవేశించి దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే చర్యతో అక్కడికి భారీగా జనం చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, చట్టసభ సభ్యులే ఇలా సీళ్లు పగులగొట్టడం ఏంటని అధికారులు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారు.

ప్రస్తుతానికి ఎమ్మెల్యే జోక్యంతో జీయాగూడ కబేళా కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే, నిబంధనలను అతిక్రమించి సీళ్లు పగులగొట్టిన ఎమ్మెల్యేపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? లేక కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గుతారా? అనేది వేచి చూడాలి. ఈ ఘటనపై పోలీసులు నిఘా ఉంచారు. ఒకవైపు ఉపాధి సమస్య, మరోవైపు అధికారిక నిబంధనల మధ్య నలిగిపోతున్న ఈ వివాదం చివరకు ఎటు దారితీస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Latest