- విద్యార్థుల ఆందోళనతో కొద్దిపాటి ఉద్రిక్తత
హైదరాబాద్, మహా : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, బైక్‌పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హోండా సిటీ కార్ ఓవర్ స్పీడ్‌తో ఉండటంతో బైక్‌ను ఢీ కొట్టి వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మరణించారు. నడిచివెళ్తున్న పాదాచారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ మృతి చెందిన యువకులిద్దరూ బండ్లగూడలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీ టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివ, సందీప్ జోహెల్ గా గుర్తించారు. రోడ్డుపై నడిచివెళ్తున్న మరో యువకుడు కూడా మృతి చెందగా అతని వివరాలు తెలియరాలేదు. కాగా,శివ,సందీప్ జోహల్ మృతితో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని స్టూడెంట్స్ ఆందోళన చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ వారు రోడ్డుపై భైఠాయించారు. పోలీసులు వారిని శాంతింప జేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







