Mahaa Daily Exclusive

  టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ … త్వరలోనే టెట్ నోటిఫికేషన్

Share

 

హైదరాబాద్, మహా : త్వరలోనే తెలంగాణ టెట్ – 2026 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మొదటి టెట్ నోటిఫికేషన్ విషయంపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో తొలి టెట్‌కు ఈ ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్‌ ఇచ్చి జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే దాదాపుగా ఈనెలలోనే నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. గతేడాది చివర్లో విడుదలైన నోటిఫికేషన్ కు కూడా చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Latest