Mahaa Daily Exclusive

  చౌటుప్పల్‌లో గజదొంగ అరెస్ట్, నగదు స్వాధీనం..

Share

  • కోర్టుకెళ్లి వస్తూ దొంగతనం చేసిన కిలాడీ
  • 62 కేసుల గజదొంగ పోలీసులకు చిక్కాడు

చౌటుప్పల్:మహా

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర గజదొంగను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 7 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పటోళ్ల మధుసూధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఆన్‌లైన్ బట్టల వ్యాపారం చేస్తూనే, విలాసాలకు మరిగి దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. గత ఫిబ్రవరి 21న చౌటుప్పల్‌కు చెందిన లింగంపల్లి నర్సింహ కుటుంబం తమ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా, అదే అదునుగా భావించిన నిందితుడు తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ. 14.20 లక్షల నగదును అపహరించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు మొదట ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ కారు హైదరాబాద్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నట్లు గుర్తించి, దాని ద్వారా నిందితుడు శ్యామ్ రిచర్డ్ అని నిర్ధారించారు.

విజయవాడ హైవేపై ధర్మోజిగూడెం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై ఇప్పటివరకు 62 చోరీ కేసులు ఉండగా, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 20 కేసులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా, ఖమ్మం కోర్టులో ఒక దొంగతనం కేసులో హాజరై తిరిగి వస్తూ, దారి మధ్యలో చౌటుప్పల్‌లో ఈ భారీ చోరీకి పాల్పడటం గమనార్హం. దొంగిలించిన సొమ్ములో కొంత బ్యాంకులో వేయగా, మరికొంత నగదుతో గోవాకు వెళ్లి క్యాసినోల్లో జూదం ఆడి ఖర్చు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ మన్మథ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ బాబు మరియు ఇతర సిబ్బందిని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అభినందించగా, డీఎస్పీ వారికి నగదు పురస్కారాలను అందజేశారు.

Latest