- వైఎస్సార్ వారసత్వాన్ని జగన్ తుంగలో తొక్కారు
- రుషికొండను మింగి ప్యాలెస్‌లు కట్టుకున్నారు
- జగన్ ఒక ‘మావిగన్ జోకర్’లా మిగిలారు
- వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
**అమరావతి, మహా**
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ పేరును కేవలం అధికారం కోసం వాడుకుంటున్న జగన్, ఆయన ఆశయాలకు ఏనాడూ వారసుడు కాలేదని ఆమె తేల్చి చెప్పారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచించిన జగన్, ఆ ముసుగులో ప్రకృతి సిద్ధమైన రుషికొండను మింగేసి తన కోసం విలాసవంతమైన ప్యాలెస్‌లను నిర్మించుకున్నారని, ప్రస్తుతం ఆయన ఒక ‘మావిగన్ జోకర్’గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ తన జీవితకాలమంతా బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తే, జగన్ మాత్రం తన కేసుల భయంతో ఆ పార్టీకి ‘దత్తపుత్రుడి’లా మారిపోయారని షర్మిల ఆరోపించారు. దేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా, చర్చిలను ధ్వంసం చేస్తున్నా ఢిల్లీ పెద్దల ముందు తలవంచి మౌనంగా ఉండటం జగన్ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన ‘జలయజ్ఞం’ ఎందుకు పూర్తి చేయలేదని ఆమె నిలదీశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను జగన్ అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా మద్యపాన నిషేధం విషయంలో జగన్ ప్రజలను ఘోరంగా మోసం చేశారని షర్మిల విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం అమ్ముతూ ‘ఓన్లీ క్యాష్’ మాఫియాను నడిపారని ఆరోపించారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే నినాదాన్ని జగన్ అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్ ప్రతి పథకం పేదల కష్టం నుంచి పుట్టిందని, కానీ జగన్ పాలనలో కేవలం స్వార్థ ప్రయోజనాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కలలు కన్న సంక్షేమ రాజ్యం మరియు ఆయన ఆశయాల సాధన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కాంగ్రెస్ వైపు నిలవాలని షర్మిల పిలుపునిచ్చారు.







