Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టోకరా..

Share

  •  పథకం పేరుతో ఎమ్మెల్యేకే సైబర్ మోసం.

హైదరాబాద్: మహా.

సామాన్యులే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారనే దానికి నిదర్శనంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎదుర్కొన్న అనుభవం నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఒక కిలాడీ మోసగాడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని నమ్మించి ఏకంగా లక్ష రూపాయలు కాజేశాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి, తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన “వికసిత్ భారత్” పథకం ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఈ పథకం కింద నియోజకవర్గంలోని అర్హులైన వారికి రూ. 10 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. లబ్ధిదారుల జాబితాను పంపిస్తే వెంటనే లోన్ ప్రక్రియ పూర్తి చేస్తామని నిందితుడు హామీ ఇచ్చాడు. దీనిని నమ్మిన ఎమ్మెల్యే, నియోజకవర్గానికి చెందిన పలువురు అర్హుల జాబితాను నిందితుడికి పంపించారు. అయితే, ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 2,500 చొప్పున చెల్లించాలని ఆ కేటుగాడు కోరాడు.

మొత్తం 40 మంది అభ్యర్థులకు సంబంధించి రూ. 1,00,000 నగదును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి బదిలీ చేశారు. డబ్బులు అందిన తర్వాత కూడా నిందితుడి ఆశ తీరక, మరిన్ని నిధులు అవసరమని మళ్ళీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. పదేపదే డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఈ విషయంపై ఆరా తీయగా తాను మోసపోయానని గ్రహించారు. వెంటనే స్పందించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ఫోన్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. టెక్నాలజీపై పట్టున్న ప్రజా ప్రతినిధులనే బురిడీ కొట్టించారంటే సైబర్ నేరగాళ్లు ఎంతగా తెగించి ఉన్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Latest